Telugu Global
Telangana

కొత్త ఆఫీస్, కొత్త బ్రాంచ్.. హైదరాబాదే అందరికీ ఫస్ట్ ఛాయిస్

Office Space in Hyderabad: దేశీయంగా కొత్తగా వినియోగంలోకి వచ్చిన ఆఫీస్ స్పేస్ మొత్తంలో 34 శాతం హైదరాబాద్ లోనే ఉండటం విశేషం. ఆ తర్వాత బెంగళూరు 26శాతం, ఢిల్లీ 21 శాతంతో 2, 3 స్థానాల్లో నిలిచాయి.

కొత్త ఆఫీస్, కొత్త బ్రాంచ్.. హైదరాబాదే అందరికీ ఫస్ట్ ఛాయిస్
X

భారత్ లో కొత్తగా ఆఫీస్ తెరవాలనుకున్న ఏ స్టార్టప్ కంపెనీ అయినా, విస్తరణకోసం కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకున్న ఏ పెద్ద సంస్థ అయినా ముందుగా హైదరాబాద్ వైపు చూస్తోంది. ప్రభుత్వ గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రైవేటు కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్న సర్వేలు కూడా హైదరాబాదే టాప్ ప్లేస్ లో ఉందని చెబుతున్నాయి.

2022-23 ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో ఆఫీస్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ నెంబర్ -1 స్థానంలో నిలిచింది. దేశీయంగా కొత్తగా వినియోగంలోకి వచ్చిన ఆఫీస్ స్పేస్ మొత్తంలో 34 శాతం హైదరాబాద్ లోనే ఉండటం విశేషం. ఆ తర్వాత బెంగళూరు 26శాతం, ఢిల్లీ 21 శాతంతో 2, 3 స్థానాల్లో నిలిచాయి.

ఐటీ మేటి..

ఇక హైదరాబాద్ లో ఏయే సంస్థలు ఏ స్థాయిలో ఆఫీస్ స్పేస్ వినియోగిస్తున్నాయనే లెక్క తీస్తే ఐటీ మొదటి స్థానంలో ఉంది. ఆఫీస్ స్పేస్ వినియోగంలో మొత్తం 39శాతం ఐటీ రంగ సంస్థలదే. అంటే కొత్తగా ఐటీ కంపెనీ పెట్టాలనుకున్న ఎవరైనా మొదటి ఛాయిస్ హైదరాబాద్ కే ఇస్తున్నారని తేలిపోయింది. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి చెప్పి, ఉద్యోగుల్ని ఆఫీసులకు పిలవడం మొదలు పెట్టాయి. దీంతో కొత్త ఆఫీస్ లకు స్థలాల వెదుకులాట ఊపందుకుంది. అప్పటికే సిద్ధంగా ఉన్న వర్క్ స్పేస్ లు చకచకా భర్తీ అవుతున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో దేశంలో అత్యధిక ఆఫీస్ స్పేస్ వినియోగం హైదరాబాద్ లోనే నమోదైంది. 82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని హైదరాబాద్ లో కంపెనీలు కొత్తగా వినియోగించుకుంటున్నాయి.

హైదరాబాద్ దేనికి గొప్ప, ఎందులో గొప్ప..?

ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ లో ఐటీరంగం అభివృద్ధి మరింత జోరందుకుంది. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకి, సౌకర్యాల కల్పన విషయంలో సానుకూల దృక్పథంతో ఉండటం వివిధ కంపెనీలు తమ శాఖల ఏర్పాటుకి ఉత్సాహం చూపుతున్నాయి. స్టార్టప్ ల స్వర్గధామం హైదరాబాద్ అనే పేరు పడింది. దీంతో సహజంగానే బెంగళూరు అవకాశాలకు గండి పడింది. అందుకే బెంగళూరు, ఢిల్లీని సైతం వెనక్కు నెట్టి ఆఫీస్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ టాప్ ప్లేస్ కి చేరుకుంది.

First Published:  6 Dec 2022 1:59 PM GMT
Next Story