Telugu Global
Telangana

బెంగళూరును మించిపోయిన హైదరాబాద్.. ఆఫీస్ స్పేస్ కోసం పెరిగిన డిమాండ్

Hyderabad Office Space: కొత్త ఆఫీసుల కోసం ఇటీవల హైదరాబాద్‌ను తమ ఫస్ట్ ఛాయిస్‌గా పలు సంస్థలు ఎంపిక చేసుకుంటున్నాయి.

Hyderabad Office Space
X

Hyderabad Office Space: బెంగళూరును మించిపోయిన హైదరాబాద్.. ఆఫీస్ స్పేస్ కోసం పెరిగిన డిమాండ్

హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరంగా మారిపోతోంది. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో అనేక మల్టీ నేషనల్ కంపెనీలు తమ కార్యాలయాలను నెలకొల్పుతున్నాయి. కోవిడ్-19 పాండమిక్ సమయంలో కూడా హైదరాబాద్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని పలు నివేదికలు వెల్లడించాయి. తాజాగా మరో అధ్యయనంలో హైదరాబాద్ నగరం బెంగళూరును మించిపోయినట్లు తేలింది.

కొత్త ఆఫీసుల కోసం ఇటీవల హైదరాబాద్‌ను తమ ఫస్ట్ ఛాయిస్‌గా పలు సంస్థలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఇప్పటికే తమ కార్యాలయాల కోసం హైదరాబాద్‌లో రెంట్లు/లీజులు తీసుకున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భవనాలను బెంగళూరు కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా అద్దెకు తీసుకున్నారు. గత ఏడాది కంటే ఇది 1.8 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆఫీస్ అద్దెలు/లీజులకు సంబంధించిన మార్కెట్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

2022-23 తొలి ప్రథమార్థంలో హైదరాబాద్‌లో 82 లక్షల చదరపు అడుగుల కొత్త ఆఫీస్ స్పేస్ అద్దకు తీసుకున్నారు. ఇది దేశంలోని టాప్ 7 నగరాలను లెక్క కడితే 34 శాతం అధికం. ఆ తర్వాత స్థానాల్లో బెంగళూరు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్-ఢిల్లీ) ఉన్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో కోల్‌కతాలో కొత్తగా ఆఫీస్ స్పేస్ ఎవరూ తీసుకోలేదని 'అనరాక్' అనే రియల్ ఎస్టేట్ సంస్థ తమ నివేదికలో పేర్కొన్నది. 2022-23 ప్రథమార్థంలో 23.85 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అమ్ముడు పోగా.. అందులో 8.2 మిలియన్ అడుగులు హైదరాబాద్‌లోనే తీసుకున్నట్లు తెలిపింది.

దేశంలో తమ వ్యాపారాలను విస్తరించాలని, బలోపేతం చేయాలని భావిస్తున్న అనేక కంపెనీలు ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నాయి. అయితే పలు అనుకూల కారణాల వల్లే ఎక్కువ మంది హైదరాబాద్ వైపు చూస్తున్నట్లు సదరు నివేదికలో పేర్కొన్నారు. దేశంలో కొత్తగా ఆఫీస్ స్పేస్‌ కోసం వెతుకుతున్న వారిలో 66 శాతం మంది ఈ ఏడు నగరాలనే ఎంపిక చేసుకుంటున్నారు. వాటిలో పైన పేర్కొన్న మూడు నగరాలతో పాటు.. ఢిల్లీ, పూణే, ముంబై కూడా ఉన్నాయి.

గతంలో బెంగళూరులో ఆఫీస్ స్పేస్ కోసం ఎక్కువగా డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని హైదరాబాద్ ఆక్రమించింది. దేశంలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ సౌత్ ఇండియాలో 59 శాతం ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో ధరలు తక్కువగా.. మిగతా నగరాలతో పోల్చుకుంటే కనెక్టివిటీ కూడా ఉండటంతోనే బడా కార్పొరేట్లు ఎక్కువగా ఈ నగరాలను ఎంపిక చేసుకుంటున్నాయి.

First Published:  2 Dec 2022 1:26 PM GMT
Next Story