Telugu Global
Telangana

అభివృద్ధి ఎక్కువ, నేరాలు తక్కువ.. హైదరాబాద్ ఘనత ఇది..

హైదరాబాద్ తో అభివృద్ధిలో పోటీపడుతున్న నగరాలు నేర నియంత్రణలో మాత్రం పూర్తిగా వెనకపడ్డాయి. ఢిల్లీ తర్వాత సూరత్, కొచ్చిన్, అహ్మదాబాద్, చెన్నై నగరాలు అత్యధిక నేరాల రేటు గల మెట్రో నగరాల జాబితాలో ఉన్నాయి.

అభివృద్ధి ఎక్కువ, నేరాలు తక్కువ.. హైదరాబాద్ ఘనత ఇది..
X

సహజంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న నగరాల్లో నేరాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశముంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, వివిధ కంపెనీలు రావడం, జన సామర్థ్యం పెరగడంతో నేరాల సంఖ్య సహజంగానే పెరుగుతుంది. కానీ, నేర నియంత్రణలో కూడా హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉండటం మాత్రం విశేషమే. దేశంలో అత్యథిక నేరాలు జరుగుతున్న మెట్రోపాలిటన్ నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం ఢిల్లీలో ప్రతి 10 లక్షల జనాభాకు 18,596 నేరాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో మాత్రం 2,599 నేరాలు మాత్రమే నమోదయ్యాయి. ఈ పోలికతో హైదరాబాద్ ఎంత సురక్షితమైన నగరమో అర్థం చేసుకోవచ్చు.

సేఫెస్ట్ నగరాల్లో మూడో స్థానం..

పశ్చిమ బెంగాల్‌ లోని కోల్‌ కతా దేశంలోనే సేఫ్ సిటీగా నిలిచింది. ఈ జాబితాలో రెండో స్థానాన్ని మహారాష్ట్రలోని పూణే దక్కించుకుంది. హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. ప్రతి 10లక్షల జనాభాకు కోల్‌ కతా 1,034 నేరాలు జరుగగా, పూణేలో 2,568 నేరాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో 2,599 నేరాలు జరిగాయి.

హైదరాబాద్ తో అభివృద్ధిలో పోటీపడుతున్న నగరాలు నేర నియంత్రణలో మాత్రం పూర్తిగా వెనకపడ్డాయి. ఢిల్లీ తర్వాత సూరత్, కొచ్చిన్, అహ్మదాబాద్, చెన్నై నగరాలు అత్యధిక నేరాల రేటు గల మెట్రో నగరాల జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ పొరుగున ఉన్న కర్నాటక రాజధాని బెంగళూరులో ప్రతి 10లక్షల జనాభాకు 4,272 నేరాలు జరుగుతున్నాయి. దేశంలో సురక్షితమైన నగరాల్లో బెంగళూరు ఐదో స్థానంలో ఉంది. బెంగళూరులో హత్యలు, మహిళలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కోల్ కతా, పూణేలో క్రైమ్ రేటు తక్కువగా ఉన్నా.. అభివృద్ధి విషయంలో ఆ నగరాల పురోగతి తక్కువే. మొత్తమ్మీద ఇటు అభివృద్ధిలోనూ, అటు నేర నియంత్రణలోనూ సత్తా చాటుతూ హైదరాబాద్ విశిష్ట గుర్తింపు తెచ్చుకుంటోంది.

First Published:  22 Sep 2022 2:45 AM GMT
Next Story