Telugu Global
Telangana

ఎయిర్‌పోర్ట్ మెట్రో పనుల్లో పురోగతి.. పెగ్ మార్కింగ్ ప్రారంభించిన అధికారులు

ఎయిర్‌పోర్ట్ మెట్రో కోసం ప్రైవేటు భూములు సేకరించాల్సిన అవసరం లేదని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.

ఎయిర్‌పోర్ట్ మెట్రో పనుల్లో పురోగతి.. పెగ్ మార్కింగ్ ప్రారంభించిన అధికారులు
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయి. మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు నిర్మించనున్న ఈ మెట్రో లైన్‌కు సంబంధించిన సర్వే పనులు పూర్తయినట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇక ఇప్పుడు పెగ్ మార్కింగ్ (ఒక ప్రదేశం ఎంత దూరంలో ఉందో చెప్పే బోర్డులు) ప్రారంభించామని అన్నారు.

సర్వేలో పేర్కొన్న పిల్లర్ లొకేషన్లను ఇక గ్రౌండ్‌పై మార్క్ చేస్తామని ఆయన చెప్పారు. పిల్లర్ల మార్కింగ్ అయిపోయిన తర్వాత అక్కడ సాయిల్ టెస్ట్ నిర్వహిస్తామని.. దాని ప్రకారమే పిల్లర్ల డిజైన్ ఉంటుందని ఆయన చెప్పారు. ఈ పెగ్ మార్కింగ్ పూర్తయితే ప్రజలకు కూడా ఎయిర్‌పోర్ట్ మెట్రో ఏ రూట్లో వెళ్తుందో అన్న అవగాహన కూడా వస్తుందని చెప్పారు. మైండ్ స్పేస్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వరకే ఈ రూట్ కాస్త క్లిష్టంగా ఉందని.. ఆ తర్వాత సులభంగానే మార్కింగ్ పూర్తవుతుందని ఆయన చెప్పారు.

ఎయిర్‌పోర్ట్ మెట్రో కోసం ప్రైవేటు భూములు సేకరించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ మెట్రోలోని బ్లూ లైన్ చివరి స్టేషన్ అయిన రాయదుర్గం నుంచి 0.9 కిలోమీటర్ల దూరంలో ఎయిర్‌పోర్ట్ మెట్రోలోని తొలి స్టేషన్ ప్రారంభం కానున్నట్లు ఆయన చెప్పారు. మైండ్‌స్పేస్ జంక్షన్‌లో నిర్మించే ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌పోర్ట్ స్టేషన్ అత్యంత ఆధునికంగా ఉంటుందని చెప్పారు.

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో సర్వే పనులను పర్యవేక్షిస్తున్న హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి


31 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌పోర్ట్ మెట్రోకు రూ.6,250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) గా పిలిచే ఈ ప్రాజెక్టును హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి అవసరమయ్యే నిధులు మొత్తం తెలంగాణ ప్రభుత్వమే అందిస్తోంది.

పెగ్ మార్క్‌లు మీడియన్‌లు ఉన్న దగ్గర రోడ్డు మధ్యలో పెడుతున్నామని.. ప్రతీ 100 మీటర్లకు ఒక చిన్న పెగ్ మార్క్.. అలాగే ప్రతీ అర కిలోమీటర్‌కు పెద్ద పెగ్ మార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇవి రాత్రి పూట కూడా స్పష్టంగా కనపడేలా అల్యూమినియం షీట్లను డిజైన్ చేశామని అన్నారు. రాయదుర్గం నుంచి బయోడైవర్సిటీ వరకు, ఖాజాగూడ రోడ్డులోని ఐటీ టవర్స్ నుంచి నానక్‌రామ్ గూడ జంక్షన్ వరకు సెంట్రల్ మీడియన్ మీద ఈ బోర్డులు అమర్చినట్లు చెప్పారు.

నానక్‌రామ్ గూడ జంక్షన్ నుంచి టీఎస్‌పీఏ జంక్షన్ వరకు ఫుట్‌పాత్ మీద ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డు మీడియన్‌పై ఈ పెగ్ మార్కింగ్స్ ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.

First Published:  1 March 2023 2:34 AM GMT
Next Story