Telugu Global
Telangana

Hyderabad: క్రికెట్ మ్యాచ్ టిక్కట్ల విక్రయం లో అవకతవకలు... HRCలో న్యాయవాది ఫిర్యాదు

ఈ నెల 25న హైదరాబాద్ లో జరగనున్నఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యచ్ టిక్కట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఓ అడ్వకేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించారు.

Hyderabad: క్రికెట్ మ్యాచ్ టిక్కట్ల విక్రయం లో అవకతవకలు... HRCలో న్యాయవాది ఫిర్యాదు
X

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ నెల 15వ తేదీనే ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఆన్ లైన్లో కానీ ఆఫ్ లైన్లో కానీ టిక్కట్ల విక్రయం ప్రారంభం కాలేదు.

ఈ మ్యాచ్ కు సంబంధించి 39 వేల టికెట్లను ఆఫ్ లైన్ లో , మిగిలిన టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాల్సి ఉంది. అయితే క్రికెట్ అభిమానులు ఆన్ లైన్ లో టిక్కట్ కొనడానికి ప్రయత్నించి విఫలమై అటు ఉప్పల్ స్టేడియంకు, ఇటు జింఖానా గ్రౌండ్స్ కు చక్కర్లు కొడుతున్నారు. టిక్కట్లు ఎక్కడా దొరకడం లేదు. టిక్కట్లు మొత్తం బ్లాక్ చేసేశారని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.ఈ రోజు నుండి జింఖానా స్టేడియంలో టికెట్ల విక్రయం జరుగుతుందని హెచ్ సీఏ వర్గాలు ప్రకటించాయి. కానీ టికెట్ల విక్రయం చేయలేదు. జింఖానా స్టేడియం గేట్లు కూడా తెరవలేదు. టికెట్ల కోసం జింఖానా స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలో సలీం అనే న్యాయవాది హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకంలో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఆన్ లైన్ లో గానీ ఆఫ్ లైన్ లో ఎన్ని టికెట్లు విక్రయించారో చెప్పాలని హైకోర్టు న్యాయవాది డిమాండ్ చేశారు. ఆఫ్ లైన్ టికెట్ల విక్రయం కోసం ఎక్కడెక్కడ‌ కౌంటర్లు ఏర్పాటు చేశారో వెల్లడించాలని కూడా ఆయన కోరారు.

ఈ మ్యాచ్ టికెట్ల విక్రయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని హెచ్ఆర్‌సీలో సలీం ఫిర్యాదు చేశారు.

First Published:  20 Sept 2022 10:05 AM GMT
Next Story