Telugu Global
Telangana

నిండుకుండలా హుస్సేన్ సాగర్.. హైదరాబాద్ లో రెడ్ అలర్ట్

హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో 513.41 అడుగులమేర నీరు చేరుకుంది. గ్రేటర్ లోని పలు చెరువులు కూడా నిండుకుండల్లా మారాయి.

నిండుకుండలా హుస్సేన్ సాగర్.. హైదరాబాద్ లో రెడ్ అలర్ట్
X

హైదరాబాద్ లో భారీ వర్షాలకు రోడ్లన్నీ కాలువల్లా మారిపోయాయి. ఎక్కడికక్కడ కాలనీలు జలమయం అయ్యాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినా కూడా ఏకధాటిగా కురుస్తున్న వర్షం ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది. అటు జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేసి నీటిని కిందకు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ కు 4వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 4,120 క్యూసెక్కులు కిందకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ కు 1,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 1,380 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. గేట్లు తెరచినా ఇన్ ఫ్లో భారీగా ఉండటంతో రెండు జలాశయాలు పూర్తి స్థాయి నీటిమట్టంతో ఉన్నాయి.

మూసీకి భారీ వరద..

మూసీకి భారీగా వరద వస్తుండటంతో నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈసీ,మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజేంద్రనగర్‌ నుంచి పోలీస్‌ అకాడమీ వైపు వెళ్లే ఔటర్‌ సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు. నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్తే దారిని నార్సింగి పోలీసులు మూసేశారు. ‍ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించారు.



యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మూసీ వరదనీటితో పరవళ్లు తొక్కుతోంది. బీబీనగర్ మండలం రుద్రవెల్లి, భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్య లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బీబీనగర్, భూదాన్ పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం భీమలింగం వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సంగెం, బొల్లేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జ్ పైనుంచి వాహన రాకపోకలను నిషేధించిన పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్

హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో 513.41 అడుగులమేర నీరు చేరుకుంది. గ్రేటర్ లోని పలు చెరువులు కూడా నిండుకుండల్లా మారాయి. మియాపూర్ లోని పటేల్ చెరువు తెగిపోవడంతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. హైదరాబాద్ లో ప్రజలు అత్యవసరమైతేనే ఇల్లు దాటి బయటకు రావాలని సూచిస్తున్నారు అధికారులు. స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు. అత్యవసర సమయాల్లో జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్లను సంప్రదించాలన్నారు.

First Published:  6 Sep 2023 5:58 AM GMT
Next Story