Telugu Global
Telangana

మొక్క రూపంలో భర్త జ్ఞాపకాలు.. ప్రతి ఏటా పుట్టినరోజు వేడుకలు

భర్త నాటినన మొక్కలో ఆయన్ను చూసుకోవడమే కాదు, దాన్ని సంరక్షించుకోడానికి కూడా ఎంతో కృషి చేశారు మాజీ చైర్ పర్సన్ విజయలక్ష్మి. గతేడాది రోడ్డు వెడల్పు చేయడం కోసం ఈ మొక్కను తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో విజయలక్ష్మి పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

మొక్క రూపంలో భర్త జ్ఞాపకాలు.. ప్రతి ఏటా పుట్టినరోజు వేడుకలు
X

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంతో పచ్చదనం పెరగడం, వాతావరణం ఆహ్లాదంగా మారడం వంటి ఉపయోగాలున్నాయనే విషయం తెలిసిందే. కానీ ఓ కుటుంబానికి మాత్రం అది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని మిగిల్చింది. విషాదాన్ని తొలగించి ప్రతి ఏటా వారికి మధురానుభూతుల్ని పంచుతోంది.

ఏడేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. అప్పట్లో తాండూరు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న కొట్రిక విజయలక్ష్మి తన భర్తతో కలసి తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటిముందు మొక్కను నాటారు. ఆరోజు ఆమె భర్త వెంకయ్య పుట్టినరోజు కూడా కావడం విశేషం. అయితే ఆ ఏడాదే వారింటిలో విషాదం చోటుచేసుకుంది, వెంకయ్య మరణించారు. మరుసటి ఏడాది భర్త పుట్టినరోజున విజయలక్ష్మి ఆ మొక్క వద్దకు వెళ్లి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు, బాధపడ్డారు. అంతలోనే తేరుకుని ఆ మొక్కకే పుట్టినరోజు వేడుక చేశారు. సరిగ్గా ఏడాది క్రితం భర్త నాటిన మొక్క వద్ద ఆమె పుట్టినరోజు వేడుక జరిపారు. ఏడేళ్లుగా ఆమె ఆ మొక్క దగ్గరే తన భర్త జయంతి వేడుకల్ని జరుపుకుంటున్నారు. ఆ మొక్కను తమ కుటుంబంలో కలిపేసుకున్నారు. ఈ పుట్టినరోజు పండగ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంపీ జోగినపల్లి సంతోష్.. ఈ వేడుకను ట్వీట్ చేయడంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కొట్రిక విజయలక్ష్మి ఆదర్శాన్ని అందరూ కొనియాడారు. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు.. మానవసంబంధాలను మరో మలుపు తిప్పాయని అంటున్నారు.


మొక్కను బతికించుకోవడం కోసం..

భర్త నాటినన మొక్కలో ఆయన్ను చూసుకోవడమే కాదు, దాన్ని సంరక్షించుకోడానికి కూడా ఎంతో కృషి చేశారు మాజీ చైర్ పర్సన్ విజయలక్ష్మి. గతేడాది రోడ్డు వెడల్పు చేయడం కోసం ఈ మొక్కను తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో విజయలక్ష్మి పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మున్సిపల్ సిబ్బంది కూడా ఆమెకు సహకరించారు, మొక్కను అప్ రూట్ చేశారు. తాండూరులోని వ్యవసాయ పరిశోధనా క్షేత్రం సిబ్బంది కూడా ఆమెకు సహకరించారు. దాదాపు ఎండిపోతుందనుకున్న దశకు చేరుకున్న ఆ మొక్కకు ప్రాణం పోశారు. అవసరమైన పోషకాలను అందించి తమ పరిశోధనా క్షేత్రంలోనే ఓ చోట దాన్ని జాగ్రత్తగా కాపాడారు. దీంతో ఈ ఏడాది కూడా ఆ మొక్క దగ్గర తన భర్త పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోగలిగారు విజయలక్ష్మి. పిల్లలు, స్నేహితులు, బంధువుల సమక్షంలో ఆ మొక్కకు బెలూన్లు కట్టి, పూలమాల వేసి.. కేక్ కట్ చేశారు. మొక్క చుట్టూ పసుపు కుంకుమ చల్లి, హారతులిచ్చారు. ఆ మొక్కను తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటున్నామని చెబుతున్నారు విజయలక్ష్మి.

First Published:  30 July 2023 11:38 AM GMT
Next Story