Telugu Global
Telangana

ఖమ్మంలో మరో సూది హత్య.. ఇక్కడ భర్తే హంతకుడు..

ఈ ఘటనలో భర్త హంతకుడు. రెండో భార్యను తెలివిగా సూదిమందు ఇచ్చి చంపేశాడు. చివరకు ఆ నేరాన్ని ఆస్పత్రిపై నెట్టి డబ్బులు కూడా కొట్టేశాడు. సీసీ కెమెరాల వల్ల పోలీసులకు చిక్కాడు.

ఖమ్మంలో మరో సూది హత్య.. ఇక్కడ భర్తే హంతకుడు..
X

కత్తితో దాడి చేయరు, గొడ్డలితో నరికే పనిలేదు, తుపాకీతో కాల్చాల్సిన అవసరం లేదు. అసలు మారణాయుధాలు సమకూర్చుకునే హడావిడే లేదు, హంతకుల ముఠా కూడా అవసరం లేదు. జస్ట్ చిన్న సూదిమందు. సూదితో పొడిస్తే ప్రాణం పోయే టెక్నిక్ కనిపెట్టారు. సింపుల్ గా చంపేస్తున్నారు. ఖమ్మంలో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భర్తను భార్య చంపించిన ఘటన తాజాగా సంచలనంగా మారింది. సరిగ్గా అలాంటి ఘటనే కొన్నిరోజుల క్రితం ఖమ్మంలో జరిగింది. ఆ ఘటనలో భర్త హంతకుడు. రెండో భార్యను తెలివిగా సూదిమందు ఇచ్చి చంపేశాడు. చివరకు ఆ నేరాన్ని ఆస్పత్రిపై నెట్టి డబ్బులు కూడా కొట్టేశాడు. సీసీ కెమెరాల వల్ల పోలీసులకు చిక్కాడు.

ఖమ్మంలో మత్తు ఇంజెక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మొన్న బైక్ పై లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి ఓ వ్యక్తిని చంపేసిన ఘటన సంచలనంగా మారింది. దీనిపై సమగ్ర విచారణ జరిపిన పోలీసులు భార్య స్కెచ్ అని గుర్తించి ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. ఈ కేసు హాట్ టాపిక్ గా ఉండగా.. ఖమ్మంలోనే మరో మత్తు మందు ఇంజక్షన్ ఘటన వెలుగు చూసింది. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం.. ఖమ్మం నగరంలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో, రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు తొలికాన్పులో పాప పుట్టింది, రెండో కాన్పులో కూడా మళ్లీ అమ్మాయే పుట్టింది. రెండో కాన్పు విషయంలో కుటుంబ కలహాలు కూడా ఎక్కువ కావడంతో రెండో భార్యకి సూది మందు ఇచ్చి చంపాలనుకున్నాడు భిక్షం. తెలివిగా ఆస్పత్రిలోనే పనికానిచ్చేశాడు. బాలింతగా ఉన్న రెండో భార్యకు అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చాడు. ఆస్పత్రి బెడ్ పై ఆమె చనిపోయిన తర్వాత, వైద్యుల నిర్లక్ష్యం అంటూ రచ్చ చేశాడు, ఆస్పత్రి యాజమాన్యం వద్ద డబ్బులు గుంజాడు. కానీ వైద్యులకు అనుమానం రావడంతో సీసీ టీవీ ఫుటేజీ చెక్ చేశారు. భిక్షం తన భార్యకు ఇంజక్షన్ చేయడాన్ని గుర్తించిన వైద్యులు నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఆలస్యంగా దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు చివరకు భిక్షంను అరెస్ట్ చేశారు. ఇటీవలే ఇలాంటి సూది మందు ఘటన జరగడంతో.. ఇప్పుడీ పాత వ్యవహారం కూడా హైలెట్ అవుతోంది. నేరగాళ్లు చేతికి మట్టి అంటకుండా, కనీసం రక్తపు బొట్టు బయటకు రాకుండా ఇలా హత్యలు చేసేస్తున్నారు. అక్కడ అక్రమ సంబంధం హత్యకు కారణం అయితే, ఇక్కడ కుటుంబ కలహాలు బాలింతను బలితీసుకున్నాయి. అక్కడ భర్త చనిపోగా, ఇక్కడ భార్య మరణించింది. కానీ నేరగాళ్లు తప్పించుకోలేకపోయారు. తెలివిగా హత్యలు చేసినా.. ఇప్పుడు కటకటాల వెనకకు వెళ్లాల్సిన పరిస్థితి.

Next Story