Telugu Global
Telangana

తెలంగాణలో భారీగా పెరిగిన పెట్టుబడులు.. ఎంఎస్ఎంఈ ఈపీసీ నివేదికలో వెల్లడి

కొత్తగా వచ్చిన పెట్టుబడుల్లో ప్రైవేటు రంగానికి చెందినవి రూ.60,618 కోట్లుగా ఉన్నాయి.

తెలంగాణలో భారీగా పెరిగిన పెట్టుబడులు.. ఎంఎస్ఎంఈ ఈపీసీ నివేదికలో వెల్లడి
X

తెలంగాణ రాష్ట్రంలో 2021-22లో కొత్తగా వచ్చిన పెట్టుబడులు 150 శాతం పెరిగినట్లు ఎంఎస్ఎంఈ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ నివేదికలో వెల్లడించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అనే సంస్థతో కలిసి ఎంఎస్ఎంఈ ఈపీసీ ఒక అధ్యయనాన్ని చేపట్టింది. దీని ప్రకారం తెలంగాణలో 2020-21లో కొత్త పెట్టుబడులు రూ.31,271 కోట్లుగా ఉండగా.. 2021-22ఓ ఏకంగా రూ.76,568 కోట్లకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలో 150 శాతం పెరుగుదల కనిపించినట్లు నివేదికలో పేర్కొన్నారు.

కొత్తగా వచ్చిన పెట్టుబడుల్లో ప్రైవేటు రంగానికి చెందినవి రూ.60,618 కోట్లుగా ఉన్నాయి. కొత్తగా పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టుల్లో.. పూర్తయిన ప్రాజెక్టుల వాటా కూడా ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా.. ఆ కాలంలో అన్ని చోట్ల వృద్ధి రేటు మందగించింది. కానీ, తెలంగాణలో మాత్రం 2.2 శాతం వ‌ృద్ధి రేటు అధికంగా నమోదు చేసినట్లు ఈపీసీ నివేదికలో స్పష్టమైంది.

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు బలంగా ఉండటమే ఈ వృద్ధికి కారణమని నివేదికలో పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో ఏ సంస్థలైనా తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి తెలంగాణ రాష్ట్రం చాలా అనుకూలమైన ప్రదేశమని నివేదికలో పేర్కొన్నారు. ఐటీ రంగానికి సంబంధించిన ఎగుమతులు తెలంగాణలో 2014-15లో రూ.66,276 కోట్లు కాగా... 2021-22 నాటికి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య కూడా 3.71 లక్షల నుంచి 7 లక్షలకు దాటి పోయినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, ఐటీ రంగాల్లోనే కాకుండా మెడికల్, ఫార్మా రంగాల్లో కూడా గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుంది. మెడికల్ టూరిజానికి సంబంధించి తెలంగాణ ఆకర్షణీయమైన వృద్ధిని నమోదు చేసినట్లు నివేదిక తెలియజేస్తోంది. ఆఫ్రికా, గల్ఫ్, కామన్వెల్త్ దేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది విదేశీ రోగులు హైదరాబాద్‌లో చికిత్స పొందినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని తెలిపారు.

First Published:  24 March 2023 2:38 AM GMT
Next Story