Telugu Global
Telangana

పండగ అంటే ఇదే.. మునుగోడులో ఘనంగా దీపావళి..

ఉప ఎన్నిక సందర్భంగా ఇటీవల మునుగోడు వాసులకు ప్రతిరోజూ పండగే అవుతోంది. ప్రత్యేకించి దీపావళి సందర్భంగా మునుగోడుకి స్వీట్లు, క్రాకర్లు భారీగా చేరుకున్నాయి. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ ఏడాది మునుగోడు వాసులు దీపావళి జరుపుకుంటున్నారు.

పండగ అంటే ఇదే.. మునుగోడులో ఘనంగా దీపావళి..
X

గతంలో మునుగోడులో జరిగిన దీపావళి పండగలన్నీ ఒక లెక్క, ఇప్పుడు జరుగుతున్న దీపావళి ఒక లెక్క. ఇంటింటికీ ఓ దీపావళి క్రాకర్స్ గిఫ్ట్ బాక్స్ చేరిపోయింది. కొన్ని ఇళ్లకు ఒకటి కాదు రెండు బాక్స్ లు వెళ్లిపోయాయి. స్వీట్ బాక్స్ తప్పనిసరి. వీటికి తోడు మహిళలకు మంచి చీరలు కూడా పంపిణీ చేశారు. చికెన్, మద్యం వీటికి అదనం. దాదాపు మునుగోడులోని ప్రతి ఇంటికీ దీపావళి బహుమతులు చేరిపోయాయి. ప్రతి ఇంటిలోనూ ఈరోజు టెన్ థౌజండ్ వాలా పేలుతోంది.

క్రాకర్స్ కొనాల్సిన పనే లేదు..

మునుగోడు పరిధిలో క్రాకర్స్ కొని కాల్చాల్సిన అవసరం ఏ ఓటరుకీ లేకుండా చేశాయి పార్టీలు. ప్రతి ఇంటికీ క్రాకర్స్ గిఫ్ట్ బాక్స్ అడక్కపోయినా చేరిపోయింది. పండగ వేళ ఇంట్లో చికెన్, మద్యానికి కూడా ఖర్చు పెట్టాల్సిన పనిలేకుండా చేశారు. దాదాపుగా ఆదివారం సాయంత్రానికే ఈ పంపిణీ పూర్తి చేశారు. మిగిలిన చోట్ల సోమవారం మధ్యాహ్నానికల్లా పంపిణీ పూర్తయింది. ఏ పార్టీకి సానుభూతిపరుడు, ఎవరికి ఓటు వేస్తారనే భేదం లేదు, అడిగిన వారికి, అడగని వారికి, వద్దన్నవారికి కూడా ఈసారి దీపావళి క్రాకర్స్ పంచిపెడుతున్నారు నాయకులు.

చికెన్ షాపుల్లో వ్యక్తిగతంగా ఎవరికీ మాంసం ఇవ్వట్లేదు. అంతా ఆల్రడీ బల్క్ ఆర్డర్ బుక్ అయిపోయింది. గ్రామస్థాయి నాయకులు షాప్ ల వద్దకు వెళ్లి చికెన్ తీసుకొచ్చి హోమ్ డెలివరీ చేస్తున్నారు. పండగకి క్యాష్ గిఫ్ట్ కూడా ఉంది. వార్డ్ సభ్యులనుంచి మండల స్థాయి నాయకుల వరకు క్యాష్ కూడా పంపిణీ చేస్తున్నారు. రూ.10వేలనుంచి లక్షన్నర రూపాయల వరకు వారి వారి స్థాయిలనుబట్టి క్యాష్ పంపిణీ చేపట్టారట.

ప్రతిరోజూ పండగే..

మొత్తానికి ఉప ఎన్నికల సందర్భంగా ఇటీవల మునుగోడు వాసులకు ప్రతిరోజూ పండగే అవుతోంది. కూలి పనులకు కూడా చాలామంది వెళ్లట్లేదు, ప్రచారానికి వెళ్లి మధ్యాహ్నానికి కూలీకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఓటర్లకు, ఓట్లు చేతులో ఉన్న ఓ మోస్తరు నాయకులకు కూడా ఎన్నికలయ్యే వరకు ప్రతిరోజూ పండగే అన్నట్టుగా ఉంది. ప్రత్యేకించి దీపావళి సందర్భంగా మునుగోడుకి స్వీట్లు, క్రాకర్లు భారీగా చేరుకున్నాయి. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ ఏడాది మునుగోడు వాసులు దీపావళి జరుపుకుంటున్నారు. మరి ఎన్నికల తర్వాత ఏ పార్టీ నాయకుడు ఈ స్థాయిలో ఆనందంగా ఉంటారో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

First Published:  24 Oct 2022 11:43 AM GMT
Next Story