Telugu Global
Telangana

ఏపీలో చెల్లని బాబు 'విజన్' తెలంగాణలో ఎలా చెల్లుతుంది?

బీసీ సామాజిక వర్గంలో మంచిపట్టున్న, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా నియమించారు చంద్ర బాబు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోనే జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పునర్వైభవం సాధించడం సాధ్యమా ?

ఏపీలో చెల్లని బాబు విజన్ తెలంగాణలో ఎలా చెల్లుతుంది?
X

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పూర్తిగా తెలంగాణలో టిడిపి దాదాపు తుడిచిపెట్టుకొనిపోయింది.పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు.ఆ పార్టీలో కీలక నాయకులంతా తమదారి తాము చూసుకున్నారు.ఇతర పార్టీలలో చేరిపోయారు.

తెలంగాణలో పేరుకే టీడీపీ తప్ప పెద్దగా ఉనికి లేదు.చంద్రబాబు అప్పుడప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు.తెలంగాణలో టిడిపిని బలోపేతం చేయాలనుకుంటున్నట్టు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు శూన్యం.తెలంగాణ టిడిపి అధ్యక్షుడు రమణ టిఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ కావడంతో తెలంగాణ అధ్యక్షుడిగా బక్కాని నరసింహులను నియమించారు.కానీ పార్టీ పుంజుకోలేదు. బీసీ సామాజిక వర్గంలో మంచిపట్టున్న, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా నియమించారు.కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

''దివంగత ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసింది నేనే. ఐటీతో రైతు బిడ్డ కంప్యూటర్ పట్టుకునేలా చేశా. తెలంగాణ సీఎం కేసీఆర్ నేను తీసుకొచ్చిన సంస్కరణలను ప్రణాళికలను అమలు చేస్తున్నారు. విజన్ 2020ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. ఏపీలో కూడా 2029 విజన్ రూపొందించవలసి ఉంది.కానీ జగన్ ప్రభుత్వం అభివృద్ధిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది''అని చంద్రబాబు అన్నారు.రాష్ట్ర విభజన అనంతరం 2014లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.ఓటుకు నోటు కేసు వ్యవహారంతో పూర్తిగా తెలంగాణ నుంచి చంద్రబాబు బిచాణా ఎత్తేశారు.అప్పటి నుంచి కెసిఆర్ విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పునర్వైభవం ఎట్లా సాధించగలదు? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాకూటమి' పక్షాన ప్రధాన ప్రచారకర్తగా రంగంలో దిగిన చంద్రబాబుకు ఎలాంటి ఎదురు దెబ్బ తగిలిందో చూసాం.చంద్రబాబు కారణంగానే మహాకూటమిని తెలంగాణ ప్రజలు తిరస్కరించినట్టు కాంగ్రెస్ పార్టీలో విశ్లేషణలు ఉన్నవి.చంద్రబాబు ప్రచారాన్ని తనకు అనుకూలంగా మలచుకొని 88 సీట్లను కేసీఆర్ ఎట్లా సులభంగా కైవసం చేసుకున్నారో కాంగ్రెస్ తెలంగాణ నాయకులను అడిగితే చెబుతారు.కనుక తెలంగాణ రాష్ట్రానికి,ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు చెల్లని రూపాయి.చంద్రబాబును,ఆయన పార్టీ టీడీపీని ప్రజలు ఆమోదించే సూచనలు కనుచూపు మేరలో లేవు.

తాను ఎంతో దూరదృష్టి కల వాడినని చంద్రబాబు ఇప్పటికి లక్ష సార్లు చెప్పి ఉంటారు.విజన్ 2020 ప్రస్తావన కూడా అందుకే.అయితే ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాలను డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి,రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి,ఇప్పుడు కేసీఆర్ కొనసాగిస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పదే పదే చెప్పుకోవడం 'మార్కెటింగ్'కు పనికి వస్తుంది తప్ప ఇంకెందుకూ పనికి రాదు.ఏ ప్రభుత్వమైనా అంతకు ముందటి ప్రభుత్వం సాగించిన పనులను కొనసాగించడం సర్వసాధారణమన్న 'చిన్న లాజిక్' ఎట్లా మిస్సయ్యారో తెలియదు. అంతే కాదు చంద్రబాబు విధానాలను కేసీఆర్ కొనసాగిస్తున్నాడన్న దాంట్లో కూడా పూర్తి సత్యం లేదు. చంద్ర బాబు వ్యవసాయాన్ని, రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ వ్యవసాయం పట్ల ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, నీటి వనరుల పెంపు తదితర కార్యక్రమాలు కేసీఆర్ చేస్తున్నారు. చంద్ర‌ర్ బాబు వీటికి పూర్తిగా వ్యతిరేకం.

ఇదిలా ఉండగా ఏపీలో వింత రాజకీయ పరిస్థితి నెలకొని ఉంది. మూడున్నరేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ మీద ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందని కొన్ని సర్వే సంస్థలు చెబుతున్నవి.వైసీపీ అంటే 'బటన్ నొక్కే ప్రభుత్వం'గా ముద్ర తెచ్చుకుంది. వైసీపీకి ప్రజాదరణ తగ్గితే అది టీడీపీకి సానుకూలంగా మారాలి కానీ అలాంటి పరిస్థితులు లేవు.వైసీపీ గ్రాఫ్ తగ్గినా టీడీపీ గ్రాఫ్ మాత్రం ఎక్కడా ఏ కోశానా పెరగడంలేదు.మరి ఈ వ్యతిరేకత ఎటు పోతోంది.ప్రజలకు రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎవరు కనిపిస్తున్నారు? ఏపీలో వైసీపీకి ధీటైన ప్రత్యామ్నాయంగా టీడీపీ బలపడలేకపోతోంది.సంక్షేమం ఒక్కటి సరిపోతుందని,అభివృద్ధి అవసరం లేదన్న కాన్సెప్ట్ తో అధికారపార్టీ పనిచేస్తోంది.

వైసీపీ క్యాడర్ ని హై కమాండ్ అసలు పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నవి. మూడున్నరేళ్ళలో ఈ గ్యాప్ బాగా పెరిగింది. నాయకులకు, కార్యకర్తకు మధ్య దూరం ఎక్కువ అయిపోయింది.దాంతో సోషల్ మీడియాలో కూడా వైసీపీ క్యాడర్ పెద్దగా ఉత్సాహంగా కనిపించడంలేదు.

టీడీపీకి అతి పెద్ద బలంగా ఉన్న అనుకూల మీడియా పచ్చ గొట్టాలు మాత్రం వైసీపీ మీద వీర లెవెల్లో దుమ్మెత్తి పోస్తున్నవి. వాటి పని అదే అన్నట్లుగా గట్టి సంకల్పంతో పనిచేస్తున్నవి. టీడీపీకి అనుకూల మీడియా మద్దతు ఇచ్చినంత మాత్రాన క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారతాయని చంద్రబాబు అనుకుంటే ఖచ్చితంగా 2019 సీన్ రిపీట్ కావచ్చు. ఎంతసేపూ చంద్రబాబు ఆరాటమే కానీ నాయకులు వీధుల్లోకి వచ్చి పోరాడిన సీన్ లేదు. అందుకే టీడీపీ గ్రాఫ్ పెరగడంలేదన్న విశ్లేషణ ఉన్నది.ఇటీవలి కాలంలో జనసేన పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతోంది.ఇందుకు కారణం చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ దూకుడు పెంచడమే! విశాఖ ఘటనలు కావచ్చు,ఇప్పటంలో సన్నివేశాలు కావచ్చు. పవన్ ఇమేజ్ ను పెంచుతున్నాయి.

ఈ పరిస్థితులల్లో ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీని చక్కదిద్దుకోకుండా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడం వలన చంద్రబాబుకు ఎలాంటి ప్రయోజనం లభించదు.

First Published:  11 Nov 2022 7:16 AM GMT
Next Story