Telugu Global
Telangana

తెలంగాణలో భారీ వర్షాలు.. రెండు రోజులు స్కూళ్లకు సెలవులు

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని విద్యా సంస్థలకు ఈరోజు, రేపు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

తెలంగాణలో భారీ వర్షాలు.. రెండు రోజులు స్కూళ్లకు సెలవులు
X

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని విద్యా సంస్థలకు ఈరోజు, రేపు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఈ ఆదేశాలు పాటించాలని చెప్పారామె.

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో చాలా జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. మరో మూడు రోజులు వానలు తప్పవని అంటున్నారు. వానల్లో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడం ఇబ్బంది కావడంతో ప్రభుత్వం సెలవలు ప్రకటించింది. రెండు రోజుల తర్వాత పరిస్థితి సమీక్షించి శనివారం స్కూల్స్ ఉంటాయో లేవో అధికారికంగా తెలిపే అవకాశముంది.

5 జిల్లాలకు రెడ్ అలర్ట్..

తెలంగాణలో మొత్తం 5 జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 7 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. నైరుతి రుతుపవనాల ద్రోణి ప్రభావంతోపాటు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కూడా తెలంగాణపై కనపడుతోంది. రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

గోదావరి పరవళ్లు..

అటు గోదావరిలోకి వరదనీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం పెరిగింది. తెలంగాణలోని వివిధ జలాశయాలు కూడా నిండుకుండల్లా మారుతున్నాయి. జలాశయాల పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటు హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జీహెచ్ఎంసీ స్పెషల్ టీమ్ లను రంగంలోకి దింపింది. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. తక్షణ సహాయక చర్యలు చేపడుతోంది.

First Published:  20 July 2023 3:32 AM GMT
Next Story