Telugu Global
Telangana

రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసు పంపిన హెచ్ఎండీఏ.. బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ చర్యలు

జాతీయ పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ.. మీడియా ముందు పబ్లిక్‌గా నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని హెచ్ఎండీఏ పేర్కొంది.

రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసు పంపిన హెచ్ఎండీఏ.. బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ చర్యలు
X

హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)ను టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (టీవోటీ) పద్దతిలో 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఈ మేరకు అంతర్జాతీయ బిడ్లు పిలిచి.. అందులో ఎక్కువ కోట్ చేసిన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు లీజును కట్టబెట్టింది. అయితే.. ఈ లీజు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా ముందస్తుగా చెల్లించాల్సిన 10 శాతం ఫీజు కూడా చెల్లించబోమని చెప్పిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. రూ.1 లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం అమ్మేసుకుందని నిరాధారమైన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ఆరోపణలపై హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు పంపించింది.

ఒక జాతీయ పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ.. మీడియా ముందు పబ్లిక్‌గా నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని హెచ్ఎండీఏ పేర్కొంది. ఒక హోదా కలిగిన వ్యక్తిగా సామాజిక, ప్రజా క్షేత్రంలో బాధ్యత కలిగి నడుచుకోవాలని సూచించింది. నవంబర్ 2022న తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును టీవోటీ పద్దతిలో లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. నేషనల్ హైవే అథారిటీ మార్గదర్శకాలను పాటిస్తూ.. ఓఆర్ఆర్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నది. ఇందు కోసం హెచ్ఎండీఏ గతేడాది నవంబర్ 9న అంతర్జాతీయ బిడ్లు ఆహ్వానించింది. ఈ బిడ్లకు సంబంధించిన పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్‌లోనే ఉన్నాయని.. సామాన్య ప్రజలకు కూడా అవి అందుబాటులోనే ఉంటాయని హెచ్ఎండీఏ పేర్కొన్నది.

టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అత్యధిక ధర కోట్ చేసి టెండర్ గెలుచుకున్నది. హెచ్ఎండీ పూర్తి పారదర్శకతతో, చట్టానికి లోబడి ఈ టెండర్లు నిర్వహించిందని తెలిపింది.ఈ మేరకు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు ఈ ఏడాది ఏప్రిల్ 4న 'లెటర్ ఆఫ్ అవార్డు' పంపినట్లు పేర్కొన్నది. టెండర్ డాక్యుమెంట్లలో ఎక్కడా అడ్వాన్స్ పేమెంట్ చెల్లించాలని పేర్కొనలేదని హెచ్ఎండీఏ తెలిపింది. హెచ్ఎండీఏ, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు మధ్య లీజు ఒప్పందం కుదిరిన తర్వాత 120 రోజుల్లో బిడ్ అమౌంట్ చెల్లించాలని మాత్రమే ఉంటుందని పేర్కొన్నది.

ఇప్పటి వరకు ఇరు పార్టీల మధ్య కన్సెషన్ ఒప్పందమే కుదరనప్పుడు ఇక ముందస్తు చెల్లింపు అనే మాటే ఉండదని హెచ్ఎండీఏ తెలిపింది. కేవలం కన్సెషన్ అగ్రిమెంట్ తర్వాత మాత్రమే ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ సదరు పేమెంట్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నది. సదరు నిబంధనలు అన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని.. ఎవరైనా వాటిని పరిశీలించుకునే వీలుందని హెచ్ఎండీఏ తెలిపింది.

ఓఆర్ఆర్ లీజు వ్యవహారంలో ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండా.. తనకు ఎంపీననే అధికారం ఉన్నదనే కారణంతో రేవంత్ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేయడంపై హెచ్ఎండీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్ఎండీఏను లక్ష్యంగా చేసుకొని అబద్దాలు ప్రచారం చేయడం మీ స్థాయికి తగదని సూచించింది. బహిరంగంగా హెచ్ఎండీఏపై అబద్దపు ఆరోపణలు, విమర్శలు చేయడం వల్ల సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతుందని తెలిపింది.

ఈ నెల 25న మీడియా సమావేశంలో హెచ్ఎండీఏపై పూర్తిగా అవాస్తవాలను, అబద్దపు ఆరోపణలు చేశారు. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ ముందస్తుగా చెల్లించాల్సిన 10 శాతం అమౌంట్ చెల్లించలేక పోయిందని కూడా మీడియాకు చెప్పారు. అసలు టెండర్ డాక్యుమెంట్‌లో అలాంటి నిబంధనే లేనపుడు.. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ మాత్రం ఎలా చెల్లిస్తుందని హెచ్ఎండీఏ ప్రశ్నించింది. ఓఆర్ఆర్ లీజుపై పూర్తి అవగాహన లేకనే రేవంత్ రెడ్డి పరిణితి లేని ఆరోపణలు చేశారని పేర్కొంది.

ఓఆర్ఆర్ లీజు అంశాన్ని రాజకీయం చేయడానికే ఇలాంటి అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని హెచ్ఎండీఏ తెలిపింది. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ముందస్తుగా అన్ని విషయాలు తెలుసుకోవాలని సూచించింది. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ డబ్బు చెల్లించడానికి గడువును పొడిగించమని కోరినట్లు కూడా మీడియాకు రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే, ఇది కూడా పూర్తిగా అవాస్తవమని.. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ ప్రతినిధులు ఎవరూ హెచ్ఎండీఏను అలా కోరలేదని సంస్థ స్పష్టం చేసింది. డాక్యుమెంట్లపై రిటైర్డ్ అధికారి బీఎల్ఎన్ రెడ్డి సంతకాలు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది కూడా ఒక తప్పుడు ప్రచారమని హెచ్ఎండీఏ పేర్కొన్నది. సంస్థ ఎండీ ట్రాన్స్‌ఫర్ కావడంతో వేరే అధికారిని ఫుల్ అడిషనల్ హోదాలో నియమించిందని.. ఆయనే సంతకాలు చేశారని తెలిపింది.

లీజు దక్కించుకున్న ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు రూ.1 లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ఆస్తులను బదిలీ చేస్తారనే ఆరోపణ కూడా సత్యదూరమని హెచ్ఎండీఏ పేర్కొన్నది. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు కేవలం టోల్ వసూలు, మెయింటెనెన్స్ కోసం మాత్రమే లీజుకు ఇచ్చామని.. ఆస్తులు పూర్తిగా హెచ్ఎండీఏ కంట్రోల్‌లోనే ఉంటాయని తెలిపింది. టీవోటీ అంటే ఏమిటో పూర్తిగా అర్థం తెలుసుకోవాలని కూడా సూచించింది.

తెలంగాణ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు లీజు అప్పగించినట్లు రేవంత్ రెడ్డి ఆరోపించడంపై కూడా హెచ్ఎండీఏ మండిపడింది. అంతర్జాతీయ టెండర్లు పూర్తి పారదర్శకతతో జరిగాయని.. అందులో ఎక్కువ కోట్ చేసిన సంస్థకే లీజు అప్పగించామని తెలిపింది. దేశవ్యాప్తంగా ఎన్నో రోడ్లు నిర్మించి, టోల్ కాంట్రాక్టులు చేపట్టిన సంస్థ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అని తెలిపారు. దాన్ని ఒక సూట్ కేస్ కంపెనీగా అభివర్ణించడంపై హెచ్ఎండీఏ అభ్యంతరం తెలిపింది. అంతే కాకుండా హెచ్ఎండీఏలో పని చేసే అధికారుల పేర్లను కూడా మీడియాలో పదే పదే ఉచ్చిరిస్తూ వారి హక్కులకు భంగం కలిగించడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

మీడియా ముందు మీరు చేసిన ఆరోపణలు అనేక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాయని.. దీని వల్ల సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిందని పేర్కొన్నది. ఇలాంటి ఫాల్స్ ప్రాపగాండ కారణంగా హెచ్ఎండీఏకు నష్టం వాటిల్లుతోందని.. దీనిపై ఐపీసీ సెక్షన్ 499 కింద పరువు నష్టం దావా వేసే అధికారం ఉందని రేవంత్ రెడ్డికి తెలిపింది.

హెచ్ఎండీఏపై చేసిన అబద్దపు ఆరోపణలపై నోటీసులు అందుకున్న 48 గంటల్లోగా బహిరంగంగా, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసింది. ప్రింట్, సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా చేసిన ఆరోపణలన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు తెలియజేయాలని కోరింది. ఒక వేళ అలా చేయకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్ఎండీఏ పంపిన లీగల్ నోటీసులో పేర్కొన్నది.

హెచ్ఎండీఏ ఇప్పటికే తప్పుడు వార్త రాసిన డెక్కన్ క్రానికల్ పత్రికకు కూడా లీగల్ నోటీసు పంపింది. ఆ పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు పంపించింది.

First Published:  26 May 2023 12:48 PM GMT
Next Story