Telugu Global
Telangana

అడవిలో విహారం.. తెలంగాణ పర్యాటకంలో మరో అద్భుతం..

అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో 25 విలాసవంతమైన గుడారాలు నిర్మిస్తోంది హెచ్ఎండీఏ. ఒక్కో గుడారం 600 చదరపు అడుగుల్లో ఉంటుంది. త్రీస్టార్‌ రేటింగ్‌ తో సదుపాయాలు కూడా ఉంటాయి.

అడవిలో విహారం.. తెలంగాణ పర్యాటకంలో మరో అద్భుతం..
X

ఏపీతో పోల్చి చూస్తే తెలంగాణలో అటవీ సంపద తక్కువ. కానీ హరితహారం ద్వారా తెలంగాణలో వృక్షసంపదని పెంచేందుకు ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఆ దిశలో అద్భుతమైన ఫలితాలు సాధించింది కూడా. ఇప్పుడు తెలంగాణ పర్యాటక రంగంలో అటవీ సంపద కూడా భాగం కాబోతోంది. అవును, దట్టమైన అడవిలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా క్యాపింగ్ సైట్ లను హైదరాబాద్ మెట్రోపాలిట‌న్‌ డెవలప్ మెంట్ అథారిటీ అభివృద్ధి చేస్తోంది.

నగరానికి సమీపంలో..

హైదరాబాద్ వాసులు అడవికి వెళ్లాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. చుట్టూ అడవి, చల్లని వాతావరణం, పక్షుల కిలకిలా రాగాలు.. ఇవన్నీ సంగారెడ్డిలోని బొంతపల్లి అర్బన్ రిజర్వ్ ఫారెస్ట్ లోనే అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ ప్రాంతంలోకి వెళ్లడానికి అనుమతి ఉండదు. కానీ ఇప్పుడు పర్యాటక రంగ అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లో క్యాపింగ్ సైట్లను అభివృద్ధి చేస్తోంది. నగరానికి దూరంగా రణగొణ ధ్వనుల నుంచి విశ్రాంతి తీసుకుని ప్రశాంత వాతావరణంలో గడిపేందుకు అవకాశం కల్పిస్తోంది.

అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో 25 విలాసవంతమైన గుడారాలు నిర్మిస్తోంది హెచ్ఎండీఏ. ఒక్కో గుడారం 600 చదరపు అడుగుల్లో ఉంటుంది. త్రీస్టార్‌ రేటింగ్‌ తో సదుపాయాలు కూడా ఉంటాయి. గరిష్టంగా ఓ కుటుంబం రెండు రోజులు బస చేసే అవకాశముంది. ట్రెక్కింగ్‌, సఫారీ, పక్షులను చూసేందుకు వీలుగా డెక్‌ లు, సైట్ సీయింగ్‌ టవర్లు, ఇతర సాహస క్రీడల్లో పాల్గొనే వసతులు ఇక్కడ ఉంటాయి. చెట్లను తొలగించకుండా వాటికి అనుసంధానంగా ఈ టెంట్లు నిర్మిస్తున్నారు. పర్యాటకులకు సౌకర్యంతోపాటు భద్రత కూడా కల్పిస్తున్నారు. నగర వాసులకు ఇదో అద్భుత అనుభూతిగా మిగిలిపోతుందని అంటున్నారు అధికారులు.

డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ ఫర్‌(డీబీఎఫ్‌ఓటీ) పద్ధతిలో వీటిని నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ వ్యయం 15 కోట్ల రూపాయలు. ప్రస్తుతం 25 గుడారాలు ఉండగా, వాటి సంఖ్యను 45కి పెంచుతున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం అన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నారు. మెట్రో నగరాలకు సమీపంలో ఇలాంటి వసతులు ఉండటం అరుదని, హైదరాబాద్ కి ఇది మరో అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

First Published:  16 Sep 2022 2:42 AM GMT
Next Story