Telugu Global
Telangana

అక్వా మెరైన్ పార్క్ కోసం బిడ్లు ఆహ్వానించిన హెచ్ఎండీఏ

డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌వోటీ) పద్దతిలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ వద్ద ఈ మెరైన్ పార్కును నిర్మించనున్నారు.

అక్వా మెరైన్ పార్క్ కోసం బిడ్లు ఆహ్వానించిన హెచ్ఎండీఏ
X

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హెచ్ఎండీఏ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఆక్వా మెరైన్ పార్క్ నిర్మించడానికి అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించింది. డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌వోటీ) పద్దతిలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ వద్ద ఈ మెరైన్ పార్కును నిర్మించనున్నారు.

కొత్వాల్‌గూడ్లోని ఎకో-హిల్ పార్క్ వద్ద నిర్మించనున్న ఈ ఆక్వా మెరైన్ పార్క్ దేశంలోనే అతి పెద్దదిగా రికార్డు సృష్టించనున్నది. ఇందులో 100 మీటర్ల గ్లాస్ టన్నెల్ కూడా ఏకర్పాటు చేస్తారు. ఈ నెల 26 నుంచి ప్రీ బిడ్డింగ్ ప్రారంభమవుతుందని హెచ్ఎండీఏ తెలిపింది. 29న ప్రీ బిడ్డింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. జూన్ 26లోపు ఆన్‌లైన్‌లో బిడ్లు సమర్పించాల్సి ఉంటుంది. టెండర్లను తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఈ-ప్రొక్యూర్‌మెంట్ సైటులో మాత్రమే అప్‌లోడ్ చేయాలని పేరకొన్నారు.

కొత్వాల్‌గూడలోని ఎకో-హిల్ పార్కులో 4.27 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆక్వా మెరైన్ పార్క్ నిర్మించనున్నారు. ఇందులో అన్ని రకాలైన జల చరాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. కర్వ్‌డ్ గ్లాస్ టన్నెల్‌తో పాటు.. ఒక రెస్టారెంట్ కూడా నిర్మించనున్నారు. డోమ్ థియేటర్, 7డీ థియేటర్, వర్చువల్ అక్వేరియం, టచ్ ట్యాంక్స్, కోయ్ ఫీడింగ్, ఇంటరాక్టీవ్ కియోస్కులు ఏర్పాటు చేస్తారు.

ఈ ఆక్వా మెరైన్ పార్కులో ఒకే సారి 2500 మంది ఉండగలిగే ఏర్పాట్లు చేస్తున్నారు. అక్వేరియం మొత్తం 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనున్నది. ఇక ఈ అక్వేరియంలో ఉంచే స్పీసీస్‌ను ప్రతీ ఏడాది 10 శాతం మేర మార్చేస్తుంటారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.300 కోట్ల వ్యయం అవుతుందని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేశారు.


First Published:  12 May 2023 6:15 AM GMT
Next Story