Telugu Global
Telangana

హైదరాబాద్‌లో హిజాబ్‌ వివాదం

ఈ విషయంలో జోక్యం చేసుకున్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కళాశాల యాజమాన్యంతో మాట్లాడారు. హిజాబ్‌ సంప్రదానికి సంబంధించిన వ్యవహారమని, ఎవరు ఎలాంటి వస్త్రాలు ధరించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని అన్నారు. హిజాబ్‌ పేరిట నిబంధనలు సరైనవి కావన్నారు.

హైదరాబాద్‌లో హిజాబ్‌ వివాదం
X

హిజాబ్‌ వివాదం ఇప్పుడు హైదరాబాద్‌కు పాకింది. గతేడాది కర్నాటక రాష్ట్రం ఉడిపిలోని ప్రభుత్వ పీయూ కళాశాల హిజాబ్‌ ధరించిన విద్యార్థులను అనుమతించకపోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. హిజాబ్‌ ధరించి కళాశాలకు రావడాన్ని ఒక వర్గానికి చెందిన కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కర్నాటక ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై నిషేధం విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీయూ కళాశాల విద్యార్థినులు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

ఇప్పుడు ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో రిపిట్‌ అయ్యింది. సంతోష్‌నగర్‌లోని కేవీ రంగారెడ్డి డిగ్రీ కాలేజీలో పరీక్ష రాయడానికి వెళ్లిన ముస్లిం విద్యార్థులను సిబ్బంది అడ్డుకున్నారు. హిజాబ్‌ ధరించినవారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించమంటూ అడ్డుకున్నారు. హిజాబ్ తొలగించి పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.

కేవీ రంగారెడ్డి కళాశాల యాజమాన్యం విధించిన ఆంక్షలతో విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చివరకు హిజాబ్‌ తీసి పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు. నగరంలో మిగతా అన్ని కాలేజీల్లో హిజాబ్‌ను అనుమతిస్తున్నారని, హిజాబ్‌ను తొలగించాలనే నిబంధనలు సరైనవి కావని విద్యార్థినులు అంటున్నారు.

ఈ విషయంలో జోక్యం చేసుకున్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కళాశాల యాజమాన్యంతో మాట్లాడారు. హిజాబ్‌ సంప్రదానికి సంబంధించిన వ్యవహారమని, ఎవరు ఎలాంటి వస్త్రాలు ధరించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని అన్నారు. హిజాబ్‌ పేరిట నిబంధనలు సరైనవి కావన్నారు. విద్యార్థినులందరినీ పరీక్షకు అనుమతించాలని కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించారు.

First Published:  17 Jun 2023 6:10 AM GMT
Next Story