Telugu Global
Telangana

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీల‌క తీర్పు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. నిందితులపై దర్యాప్తు కు విధించిన తాత్కాలిక స్టేను కోర్టు ఎత్తివేసింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీల‌క తీర్పు
X

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కు ప్రయత్నించి అడ్డంగా బుక్కైన రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజీ, నంద కుమార్ ల‌ పై దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారి మీద దర్యాప్తుపై గతంలో ఇచ్చిన తాత్కాలిక స్టేను హైకోర్టు ఎత్తి వేసింది.

ఈ కేసులో లోతైన దర్యాప్తు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల మొయినాబాద్ పోలీసులు ఈ కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

మరో వైపు ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని బీజేపీ నేత ప్రేమేంద రెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు పెండింగ్ పెట్టింది.

టీఅరెస్ ఎమ్మెల్యేలను కొనడానికి పైన తెలిపిన ముగ్గురు నిందితులు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపుర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావుల తో సమావేశమై, వారు బీజేపీలో చేరితే కోట్ల రూపాయల సొమ్ము, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మొయినాబాద్ లోనీ ఓ ఫాం హౌస్‌లో గత నెల 26వ తేదీన పోలీసులు ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి , సింహయాజీ, నంద కుమార్‌ల‌ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఈ ముగ్గురు ప్ర‌స్తుతం చంచ‌ల్ గూడ జైల్లో ఉన్నారు.

First Published:  8 Nov 2022 10:15 AM GMT
Next Story