Telugu Global
Telangana

ఇకపై అన్నీ కొత్త ప్రశ్నాపత్రాలే.. టీఎస్‌పీఎస్సీ నిర్ణయం

ఇప్పటికే పాత వారి స్థానంలో కొత్త సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌ల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. కొత్త ప్రశ్నాపత్రాలు రూపొందిస్తున్నా.. పరీక్షల తేదీల్లో మాత్రం మార్పు లేదని సర్వీస్ కమిషన్ చెబుతోంది.

ఇకపై అన్నీ కొత్త ప్రశ్నాపత్రాలే.. టీఎస్‌పీఎస్సీ నిర్ణయం
X

టీఎస్‌పీఎస్సీ నిర్వహించబోయే అన్ని పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నాపత్రాలు రూపొందించాలని బోర్డు నిర్ణయించింది. ఏప్రిల్ 4న నిర్వహించనున్న హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష నుంచి అన్ని పరీక్షలకు కొత్త క్వశ్చన్ పేపర్లు రూపొందించనున్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించనున్న అన్ని పరీక్షలకు ఇప్పటికే ప్రశ్నాపత్రాలు సిద్ధం చేశారు. మరి కొన్ని పరీక్షలకు ప్రశ్నల ఎంపిక పూర్తయ్యింది. కాగా, ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టేయాలని.. కొత్త ప్రశ్నాపత్రాలను రూపొందించాలని నిర్ణయించారు.

ఇటీవల టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి చూసింది. సర్వీస్ కమిషన్‌కు చెందిన ఉద్యోగే ఈ క్వశ్చన్ పేపర్లను లీక్ చేసినట్లు తేలడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే, రాబోయే పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా లీక్ అయినట్లు గుర్తించడంతో సర్వీస్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా ఏ పరీక్షకు చెందిన ప్రశ్నల ఎంపిక అయినా కొంత మంది సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ చేస్తుంటారు. ఈ ప్రశ్నలు రూపొందించడంలో ఎవరెవరు? ఎంత మంది? ఎక్కడ పని చేస్తున్నారనే విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. అంతే కాకుండా ఒకరి వివరాలు మరొకరికి తెలయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాగా, ప్రస్తుతం కొన్ని ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు తేలడంతో.. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లను కూడా మార్చాలని సర్వీస్ కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం.

ఇప్పటికే పాత వారి స్థానంలో కొత్త సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌ల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. కొత్త ప్రశ్నాపత్రాలు రూపొందిస్తున్నా.. పరీక్షల తేదీల్లో మాత్రం మార్పు లేదని సర్వీస్ కమిషన్ చెబుతోంది. ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్, ఏప్రిల్ 23న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, ఏప్రిల్ 25న అగ్రికల్చర్ ఆఫీసర్‌తోపాటు ఆ తర్వాత జరుగబోయే పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప్-1 మెయిన్స్, జూలై 1న గ్రూప్-4, అగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్షలు జరుగనున్నాయి.

అయితే ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన 26 నోటిఫికేషన్లలో 7 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి. మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష నిర్వహించగా.. ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనతో దాన్ని రద్దు చేశారు. అలాగే ముందు జాగ్రత్తగా ఈ నెల 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో), 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగ పరీక్షలకు కూడా వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

First Published:  17 March 2023 4:22 AM GMT
Next Story