Telugu Global
Telangana

జింఖానా తొక్కిసలాటతో ముందు జాగ్రత్త.. క్రికెట్ మ్యాచ్‌కి భారీ బందోబస్తు..

మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు 40వేలమంది ప్రేక్షకులు వస్తారని అంచనా. వీరిని కంట్రోల్ చేసేందుకు దాదాపు 2500 మంది పోలీసులను వినియోగిస్తున్నారు.

జింఖానా తొక్కిసలాటతో ముందు జాగ్రత్త.. క్రికెట్ మ్యాచ్‌కి భారీ బందోబస్తు..
X

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 25న జరగాల్సిన భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. టికెట్ల అమ్మకాల విషయంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని, స్టేడియం వద్ద పగడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు రాచకొండ సీపీ మహేష్ భగవత్‌. మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్ కు 40 వేల మంది ప్రేక్షకులు వస్తారని అంచనా. వీరిని కంట్రోల్ చేసేందుకు దాదాపు 2500 మంది పోలీసులను వినియోగిస్తున్నారు.

అందుబాటులో రవాణా..

మ్యాచ్ పూర్తయిన తర్వాత ప్రేక్షకులు ఇళ్లకు వెళ్లేందుకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ని అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు అధికారులు. మ్యాచ్‌ జరిగే రోజు రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ప్రత్యేకంగా 300 సీసీటీవీ కెమెరాల ద్వారా స్టేడియం వద్ద పరిస్థితిని నిత్యం మానిటర్ చేస్తామన్నారు. గ్రౌండ్‌లో కూడా ప్రతి వ్యక్తిపై ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు.

మొబైల్స్ కి ఓకే, కెమెరాలు వద్దు..

గతంలో హైదరాబాద్ మ్యాచ్‌లకు సెల్ ఫోన్లకు అనుమతి లేదు. అయితే ఇప్పుడు మ్యాచ్‌లకు సెల్‌ఫోన్‌లు, బ్లూ టూత్ లు అనుమతిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. కెమెరాలు మాత్రం తీసుకురావద్దని చెప్పారు. హెల్మెట్లకు కూడా నో పర్మిషన్. సిగరెట్లు, లైటర్లు, ఇతర మత్తు పానీయాలు కూడా లోపలికి తీసుకురాకూడదు. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, తినుబండారాలు కూడా లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. బ్యాగ్‌లు, ల్యాప్ టాప్‌లు కూడా ఇంటి వద్దే పెట్టి రావాల్సి ఉంటుంది. సహజంగా మ్యాచ్ అంటే జేబు దొంగలకు కూడా పని ఎక్కువగా ఉంటుంది. తోపులాటలో దొంగలు తమ పని కానిచ్చేస్తుంటారు. గతంలో పర్స్ లు, ఇప్పుడు మొబైళ్లు ఎక్కువగా దొంగలపాలవుతుంటాయి. ఈ క్రమంలో జేబు దొంగలపై కూడా ప్రత్యేక నిఘా పెట్టామంటున్నారు పోలీసులు. స్టేడియం వద్ద ఏడు అంబులెన్సులు అందుబాటులో ఉంచుతున్నారు.

First Published:  23 Sep 2022 3:42 PM GMT
Next Story