Telugu Global
Telangana

తెలంగాణలో ఈ రాత్రికి భారీ వర్షాలు.. కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్

అన్ని కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి.. 24 గంటల పాటు మానిటర్ చేస్తూ ఉండాలని సీఎస్ చెప్పారు.

తెలంగాణలో ఈ రాత్రికి భారీ వర్షాలు.. కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్
X

తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది.

భారీ వర్షాలను ధీటుగా ఎదుర్కునేందుకు జిల్లా కలెక్టర్లను సిద్ధంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. అన్ని కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి.. 24 గంటల పాటు మానిటర్ చేస్తూ ఉండాలని చెప్పారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేయాలని సీఎస్ సూచించారు. కాగా, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని అప్పటికప్పుడు తరలించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పారు.

ఈ నెల 18 నుంచి 22 మధ్య భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు గురువారమే ఆదేశించింది. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సామాజిక కార్యకర్త, న్యాయవాది చెరుకు సుధాకర్ వేసిన పిల్‌పై విచారణ జరిపింది. ఈ సందర్భంగానే వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

కాగా, వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని.. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం చురుగ్గా ఉన్నట్లు కూడా తెలిపింది.

రాగల రెండు మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశలో ఉత్తర ఒడిషా నుంచి ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు అల్పపీడనం ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది.

First Published:  18 Aug 2023 2:22 PM GMT
Next Story