Telugu Global
Telangana

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు

మునావర్ కార్యక్రమం యధావిధిగా జరిగినా.. రాజాసింగ్ మాత్రం మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు
X

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ లభించింది. పీడీ యాక్ట్ నమోదు చేసి తన భర్తను అక్రమంగా జైల్లో పెట్టారని రాజాసింగ్ భార్య ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయనకు షరతులతో కూడిని బెయిల్ మంజూరు చేసింది. మీడియాతో మాట్లాడకూడదని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, ఎలాంటి ర్యాలీల్లో పాల్గొనకూడదని హైకోర్టు షరతులు విధించింది. దీంతో 75 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపిన రాజాసింగ్ ఇంటికి రానున్నారు.

మునావర్ ఫారూఖీ అనే స్టాండప్ కమేడియన్ హైదరాబాద్‌లో ఒక కార్యక్రమం కోసం వచ్చారు. ఫారూఖీ హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాజా సింగ్ ఆ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయమని పిలుపునిచ్చారు. అదే సమయంలో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. సౌత్ జోన్ పోలీసులు ఏకంగా కర్ఫ్యూని తలపించేలా బందోబస్తు పెట్టారు. బీజేపీ కూడా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

మునావర్ కార్యక్రమం యధావిధిగా జరిగినా.. రాజాసింగ్ మాత్రం మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. కానీ మరుసటి రోజు ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత కూడా రాజాసింగ్ తన వ్యాఖ్యలను కొనసాగించడంతో పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు కూడా ఆయన అరెస్టును సమర్థించింది.

పలుమార్లు తనపై పెట్టిన పీడీ యాక్ట్ తొలగించాలని రాజా సింగ్ పిటిషన్లు వేశారు. కానీ ఆయనపై ఉన్న అభియోగాలకు పీడీ యాక్ట్ సరైందే అని కోర్టు భావించింది. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కూడా రాజాసింగ్ భార్య వినతిపత్రం అందించారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరికి హైకోర్టును రాజాసింగ్ భార్య ఆశ్రయించారు. తన భర్తపై పెట్టిన పీడీ యాక్ట్ తీసేయాలని, విడుదల చేయాలని కోరారు. దీంతో ఆ అభ్యర్థనను స్వీకరించి.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ, పీడీ యాక్ట్ మాత్రం రాజాసింగ్‌పై కొనసాగుతుందని ధర్మాసనం చెప్పింది.

First Published:  9 Nov 2022 11:49 AM GMT
Next Story