Telugu Global
Telangana

హైకోర్టు జడ్జి ట్రాన్స్‌ఫర్ ఆపాలని న్యాయవాదుల పోరాటం.. ఇవ్వాళ సీజేఐకి వినతిపత్రం

జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీని నిలిపివేసి.. తిరిగి ఆయనను తెలంగాణ హైకోర్టుకు కేటాయించాలని వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలుస్తున్నది.

హైకోర్టు జడ్జి ట్రాన్స్‌ఫర్ ఆపాలని న్యాయవాదుల పోరాటం.. ఇవ్వాళ సీజేఐకి వినతిపత్రం
X

తెలంగాణ హైకోర్టులో జడ్జిగా పని చేస్తున్న జస్టిస్ అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఇప్పటికే ఆయన బదిలీకి సంబంధించిన నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (టీహెచ్‌సీఏఏ) సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం విధులను బహిష్కరించిన టీహెచ్‌సీఏఏ.. శనివారం కూడా తమ ఆందోళనను కొనసాగించనున్నట్లు అధ్యక్షుడు వి. రఘునాధ్ తెలిపారు.

మరోవైపు టీహెచ్‌సీఏఏ ప్రతినిధులు శనివారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ను కలువనున్నారు. జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీని నిలిపివేసి.. తిరిగి ఆయనను తెలంగాణ హైకోర్టుకు కేటాయించాలని వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలుస్తున్నది. శుక్రవారం చాలా మంది న్యాయవాదులు నిరసనలో భాగంగా కోర్టుకు హాజరుకాలేదు. కొంత మంది కోర్టు హాళ్లలో తిరుగుతూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని, కేసులను వాయిదా వేయాలని జడ్జిలను కోరారు. దీంతో కేసుల నిమిత్తం వచ్చిన చాలా మంది ఇబ్బందులు పడ్డారు.

గతంతో తెలంగాణ హైకోర్టులో సీనియర్ జడ్జిలుగా ఉన్న జస్టిస్ వీపీ. సంజయ్ కుమార్, జస్టిస్ ఎంఎస్. రామచంద్రరావు, జస్టిస్ అమర్‌నాధ్ గౌడ్‌లను ఇతర హైకోర్టులకు జూనియర్ జడ్జిలుగా బదిలీ చేశారు. అప్పుడు కూడా న్యాయవాదుల ఆందోళనతో వారి బదిలీలు ఆగిపోయాయి. న్యాయ పరిపాలనలో టీహెచ్‌సీఏఏది కీలక పాత్ర అయినా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా సీనియర్ జడ్జిలను బదిలీ చేయడంపై అసోసియేషన్ మండి పడుతోంది. సుప్రీకోర్టు కొలీజియం రహస్యంగా తమ అధికారాలను ఉపయోగించి బదిలీలు చేయడం సరైంది కాదని అసోసియేషన్ వాదిస్తోంది.

హైకోర్టు పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టుకు ఎలాంటి అధికారాలు లేవని అసోసియేషన్ చెప్తోంది. తనకు తానుగా అధికారాలు ఇచ్చుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జ్యుడీషియల్ సిస్టమ్‌కు మంచిది కాదని అంటోంది. జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీని వెంటనే నిలిపివేసి ఆయనను తిరిగి తెలంగాణ హైకోర్టుకే కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. అప్పటి వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేసింది.

First Published:  19 Nov 2022 3:30 AM GMT
Next Story