Telugu Global
Telangana

మదన్‌ రెడ్డి అలక.. హరీష్‌ రావు బుజ్జగింపు

మాజీ మంత్రి హరీష్‌ రావు అలర్ట్ అయ్యారు. మెదక్ జిల్లా కౌడిపల్లిలోని మదన్‌ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. హరీష్‌ రావు వెంట నర్సాపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి ఉన్నారు.

మదన్‌ రెడ్డి అలక.. హరీష్‌ రావు బుజ్జగింపు
X

ఉమ్మడి మెదక్‌ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చిలుముల మదన్ రెడ్డి అలకబూనారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడుతారన్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్‌ నేత, మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో ఆయన సమావేశం కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.

ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్‌ రావు అలర్ట్ అయ్యారు. మెదక్ జిల్లా కౌడిపల్లిలోని మదన్‌ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. హరీష్‌ రావు వెంట నర్సాపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి ఉన్నారు. పార్టీని వీడొద్దని మదన్‌ రెడ్డిని హరీష్‌రావు బుజ్జగించినట్లు సమాచారం. చర్చల అనంతరం మాట్లాడిన హరీష్‌ రావు పెద్దాయనను కాపాడుకుంటామని చెప్పారు. ఇక వ్యక్తిగత పనుల నిమిత్తమే మైనంపల్లిని కలిసినట్లు చెప్పారు మదన్‌ రెడ్డి. బీఆర్ఎస్‌లో తనకు అన్యాయం జరిగిన విషయం ప్రజలకు కూడా తెలుసని, త‌న భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందన్నారు.

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా వరుసగా విజయం సాధించారు మదన్ రెడ్డి. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రత్యర్థి సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరడంతో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్ టికెట్ ఇచ్చిన కేసీఆర్.. మెదక్ ఎంపీగా అవకాశం ఇస్తానని మదన్ రెడ్డికి హామీ ఇచ్చారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మెదక్ ఎంపీగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి అవకాశం ఇచ్చారు. రెండు అవకాశాలు చేజారడంతో మదన్‌ రెడ్డి అసంతృప్తిలో ఉన్నారని సమాచారం.

First Published:  27 March 2024 5:29 AM GMT
Next Story