Telugu Global
Telangana

దుబ్బాకపై హరీష్ రావు ఫోకస్.. రఘునందన్ కి గుబులు

హరీష్ రావు, దుబ్బాకపై ఫోకస్ పెంచడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ కి ఉక్కపోత మొదలైంది. అందుకే ఆయన, తన ప్రత్యర్థిని కాకుండా హరీష్ రావునే టార్గెట్ చేస్తూ పొలిటికల్ స్టేట్ మెంట్లిస్తున్నారు.

దుబ్బాకపై హరీష్ రావు ఫోకస్.. రఘునందన్ కి గుబులు
X

దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి ఈసారి గెలుపుపై ధీమా లేదు. ఉప ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన రఘునందన్ కి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అంత సులభం కాదని తేలిపోయింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ ఇక్కడ బరిలో దింపింది. ఆయనపై జరిగిన హత్యాయత్నంతో జనంలో సింపతీ పెరిగింది. దీనికితోడు హరీష్ రావు ఈ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం, ప్రచార బాధ్యతను కూడా తానే చేపట్టడంతో రఘునందన్ రావు టెన్షన్ పడుతున్నారు. దుబ్బాకలో విమర్శలకు దిగేతే సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో తానే స్వయంగా చర్చకు వస్తానని హరీష్ కి సవాల్ విసిరారు రఘునందన్.

దుబ్బాక నియోజకవర్గంలో విజయం ఈసారి బీఆర్ఎస్ కి కీలకంగా మారింది. 2018లో ఇక్కడ సోలిపేట రామలింగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అకాల మరణంతో 2020లో ఉప ఎన్నికలొచ్చాయి. ఆయన భార్య సోలిపేట సుజాతరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో 1,079 ఓట్ల స్వల్ప తేడాతో ఆమె ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారు. ఈ గెలుపు తర్వాతే తెలంగాణలో బీజేపీకి ఓ ఊపు వచ్చింది. ఆ ఓటమితో బీఆర్ఎస్ లో అంతర్మథనం పెరిగింది. ఉప ఎన్నికల్లో అన్నీతానై నడిపించిన హరీష్ రావు ఆ ఫలితంతో నిరాశ చెందినా.. ఈసారి ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచార పర్వంలో దిగారు. కొత్త ప్రభాకర్ రెడ్డి తరపున దుబ్బాకలో హరీష్ జోరుగా ప్రచారం చేస్తున్నారు.

హరీష్ ఇన్వాల్వ్ మెంట్ ని తట్టుకోలేకపోతున్నారు రఘునందన్ రావు. దుబ్బాకపై పెత్తనం చేయడం ఇకనైనా మానుకోవాలని ఘాటుగా స్పందించారు రఘునందన్. 2014 నుంచి మంత్రి పదవిలో ఉన్న హరీష్, ​దుబ్బాకను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. తనపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. మొత్తమ్మీద హరీష్ రావు, దుబ్బాకపై ఫోకస్ పెంచడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ కి ఉక్కపోత మొదలైంది. అందుకే ఆయన, తన ప్రత్యర్థిని కాకుండా హరీష్ రావునే టార్గెట్ చేస్తూ పొలిటికల్ స్టేట్ మెంట్లిస్తున్నారు.

First Published:  10 Nov 2023 4:48 AM GMT
Next Story