Telugu Global
Telangana

కాంగ్రెస్‌కు ఓటేస్తే మోటార్లకు మీటర్లు.. ఇదిగో సాక్ష్యం- హరీష్‌ రావు

నిర్మలా సీతారామన్ బీజేపీతో పాటు కాంగ్రెస్ బండారం కూడా బయటపెట్టేశారన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెడుతున్నాయని.. తెలంగాణ పెట్టలేదు కాబట్టే డబ్బులు ఇవ్వడం లేదని నిర్మలా స్పష్టంగా చెప్పారన్నారు హరీష్ రావు.

కాంగ్రెస్‌కు ఓటేస్తే మోటార్లకు మీటర్లు.. ఇదిగో సాక్ష్యం- హరీష్‌ రావు
X

వ్య‌వ‌సాయ బావుల మోటార్ల‌కు మీటర్లు పెట్టనందునే తెలంగాణకు నిధులు విడుదల చేయలేదంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి హరీష్‌రావు. ఇన్నాళ్లు బీజేపీ నాయకులు అబద్ధాలతో అదరగొట్టే ప్రయత్నం చేశారన్నారు. మోటార్లకు మీటర్ల అంశంపై నిర్మలా సీతారామన్ కుండబద్దలు కొట్టారని చెప్పారు. తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

మోటార్లకు మీటర్లు పెట్టేది లేదంటూ అసెంబ్లీలో కరాఖండిగా చెప్పిన వ్యక్తి కేసీఆర్‌ అని గుర్తుచేశారు మంత్రి హరీష్‌ రావు. నిర్మలా సీతారామన్ బీజేపీతో పాటు కాంగ్రెస్ బండారం కూడా బయటపెట్టేశారన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెడుతున్నాయని.. తెలంగాణ పెట్టలేదు కాబట్టే డబ్బులు ఇవ్వడం లేదని నిర్మలా స్పష్టంగా చెప్పారన్నారు హరీష్ రావు. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో మీటర్లు పెట్టారని.. మరికొన్ని రాష్ట్రాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేసీఆర్ ఉన్నారు కాబట్టే తెలంగాణలో అది సాధ్యం కాలేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక మోటార్ల‌కు మీటర్లు పెట్టేందుకు అంగీకరించాయని స్ప‌ష్టం చేశారు. పొర‌పాటున తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే ఇక్కడ కూడా మీటర్లు పెట్టడం ఖాయమని, ద‌య‌చేసి రైతులంతా అప్ర‌మ‌త్త‌తో ఓటు వేయాల‌ని హరీష్ రావు సూచించారు.


కాంగ్రెస్‌, బీజేపీ రైతు పాలిట శత్రువులన్న హరీష్‌ రావు.. యూపీఏ వేసిన స్వామినాథన్‌ కమిటీని ఆ పార్టీ తుంగలో తొక్కిందన్నారు. గెలవగానే అమలు చేస్తామని చెప్పి మోడీ మోసం చేశారన్నారు. బీజేపీ పాలిత అస్సాం, యూపీ, మణిపూర్‌లో మీటర్లు పెట్టారని.. ఇండియా కూటమిలోని తమిళనాడు, బెంగాల్‌, కేరళలోనూ మీటర్లు పెట్టారని స్పష్టంచేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు సంబంధించిన కూటమిలో లేనప్పటికీ.. ఏపీ, మేఘాలయ వంటి రాష్ట్రాలు మీటర్లు పెట్టాయన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని తెగేసి చెప్పిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బావుల దగ్గర మీటర్లు పెట్టేందుకు అంగీకరించినట్లేనన్నారు హరీష్‌ రావు. ఈ అంశంపై ఎవరు చర్చకు వచ్చిన తాను సిద్ధమేనని సవాల్ విసిరారు.

First Published:  22 Nov 2023 7:38 AM GMT
Next Story