Telugu Global
Telangana

కాంగ్రెస్ లో ఉన్నానని మరచిపోయిన రేవంత్.. హరీష్ సెటైర్

కేవలం బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే రేవంత్ రెడ్డి బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకున్నారని విమర్శించారు హరీష్ రావు.

కాంగ్రెస్ లో ఉన్నానని మరచిపోయిన రేవంత్.. హరీష్ సెటైర్
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఈడీ అరెస్ట్ లకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఒకలా మాట్లాడుతుంటే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోలా మాట్లాడుతున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బహుశా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న విషయం మరచిపోయారేమోనని సెటైర్లు పేల్చారు. రేవంత్‌ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీటీం లీడర్‌ లాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లుగా లేదన్నారు. అసలు రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ నాయకత్వంలో పనిచేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బీజేపీకి, మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మరోసారి తేటతెల్లమయిందన్నారు హరీష్ రావు.

కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం అనుకూలంగా మార్చుకుందన్నారు హరీష్ రావు. లిక్కర్‌ స్కామ్‌ పేరుతో రాజకీయ వేధింపుల కోసం ఆయా సంస్థలను వాడుకుంటోందని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా తమ ఆరోపణలను సమర్థిస్తున్నారని.. మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుని కాంగ్రెస్‌ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే తప్పుబట్టారని గుర్తు చేశారు. తాము ప్రస్తావించిన విషయాలనే వారు కూడా చెప్పారన్నారు హరీష్ రావు. అక్రమ అరెస్టులను మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ ఖండించారు కానీ.. రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఏఐసీసీ నాయకులకు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు హరీష్.

రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ మనిషి కాదని, ఆర్ఎస్ఎస్ భావజాలం నిండి ఉన్న మోదీ మనిషి అని.. విమర్శించారు హరీష్ రావు. చాన్నాళ్లుగా తాము ఇదే విషయం చెబుతున్నామని, ఇప్పుడు అదే నిజమని తేలిందని అన్నారు. కేవలం బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే రేవంత్ రెడ్డి బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకున్నారని విమర్శించారు హరీష్ రావు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విధానాలను కాదని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

First Published:  22 March 2024 3:03 PM GMT
Next Story