Telugu Global
Telangana

కరెంటు బిల్లుతో వెరైటీ కష్టాలు.. హరీష్ రావు ఆసక్తికర లేఖ

ఆ నిబంధన వల్ల చాలామంది పేదలు ఇబ్బందులు పడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు.

కరెంటు బిల్లుతో వెరైటీ కష్టాలు.. హరీష్ రావు ఆసక్తికర లేఖ
X

తెలంగాణలో 200 యూనిట్లలోపు కరెంటు వాడుకునే వారికే ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. మీటర్ రీడింగ్ 201కి మారితే మొత్తం అన్ని యూనిట్లకు బిల్లు చెల్లించాల్సిందే. కాంగ్రెస్ పథకంలోని డొంకతిరుగుడు నిబంధన ఇది. ఈ నిబంధన వల్ల చాలామంది పేదలు ఇబ్బందులు పడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఈ లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది.


రీడింగ్ కష్టాలు..

ఫ్రీ కరెంటు లబ్ధిదారులు ప్రతి రోజు ఉదయాన్నే లేచి మీటర్ వైపు చూస్తున్నారని, రీడింగ్ నోట్ చేసుకుని లెక్కలు వేసుకుని మరీ కరెంటు పొదుపుగా వాడుకుంటున్నారని చెప్పారు హరీష్ రావు. పొరపాటున కరెంటు వాడకం 200 యూనిట్లకు దగ్గరగా వస్తే ఫ్యాన్ వేసుకోవాలా, వద్దా.. లైటు వేయాలా, వద్దా.. అనే సందిగ్ధంలో ఉండిపోతున్నారని అన్నారు. మీటర్ రీడింగ్ చూసి ఫ్యాన్లు, లైట్లు ఆపేసుకుని అవస్థలు పడుతున్నారని వివరించారు. పొరపాటున 200 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు వాడితే ఎక్కువగా వాడిన వాటికే బిల్లు చెల్లించేలా ఈ పథకంలో నిబంధనలు మార్చాలని సూచించారు. 200 యూనిట్ల వరకు అయ్యే బిల్లుని ప్రభుత్వమే చెల్లించాలని, ఆ తర్వాత రీడింగ్ తిరిగితే అది వినియోగదారుడి నుంచి వసూలు చేసుకోవచ్చని అన్నారు హరీష్ రావు.

అందరికీ వర్తింపజేయాలి..

రాష్ట్రంలోని 90 ల‌క్ష‌ల మంది తెల్ల రేష‌న్ కార్డుదారులు ఉండగా ఉచిత విద్యుత్ మాత్రం 30 ల‌క్ష‌ల మందికే వ‌ర్తింప‌జేస్తున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు హరీష్ రావు. హైద‌రాబాద్‌లో 10 ల‌క్ష‌ల మందికే ఈ ప‌థ‌కం వ‌ర్తింపజేస్తున్నారని మిగతావారికి న్యాయం చేయరా అని అడిగారు. మొత్తం 90 ల‌క్ష‌ల పేద కుటుంబాల‌కు ఉచిత విద్యుత్ ప‌థ‌కం వ‌ర్తింప‌జేయాలని డిమాండ్ చేశారు. ఒక రేషన్ కార్డు కింద ఒక కుటుంబాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడంతో ఆ కార్డులో పేరుండి, వేరు కుటుంబంగా ఉన్నవారికి అన్యాయం జరుగుతోందన్నారు హరీష్ రావు. వారందరినీ ఒకే కుటుంబంగా లెక్క కట్టి ఒక్కరికే పథకం వర్తింపచేయడం సరైన పద్ధతి కాదన్నారు.

First Published:  5 March 2024 1:13 PM GMT
Next Story