Telugu Global
Telangana

సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్ మాల్ .. హరీష్ కార్యాలయం వివరణ

అయితే హరీష్ రావు కార్యాలయం తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. నరేష్ అనే వ్యక్తితో హరీష్ రావుకి కానీ, ఆయన కార్యాలయానికి కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్ మాల్ .. హరీష్ కార్యాలయం వివరణ
X

ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కుల వ్యవహారంలో నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అందులో నరేష్ అనే వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావు వద్ద పీఏగా పనిచేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని హరీష్ రావు కార్యాలయం ఖండించింది. ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేసిన సమయంలో.. ఆయన ఆఫీస్ లో నరేష్ కంప్యూటర్ ఆపరేటర్ గా, తాత్కాలిక ఉద్యోగిగా ఉన్నారని ఓ ప్రకటన విడుదల చేసింది. CMRF చెక్కుల విషయంలో నరేష్ చేసిన తప్పుని కార్యాలయం మొత్తానికి ఆపాదించొద్దని కోరింది. తప్పుడు ప్రచారం ఆపాలని, వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలని ఆ ప్రకటనలో పేర్కొంది.


అసలేం జరిగింది..?

హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ లో నరేష్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశారు. కార్యాలయం మూసివేసిన తర్వాత సిబ్బందిని అక్కడినుంచి పంపించి వేశారు. అయితే నరేష్ ఎవరికీ తెలియకుండా కొన్ని CMRF చెక్కులను తనతో తీసుకెళ్లారు. అప్పట్లోనే ఆ విషయం గుర్తించిన హరీష్ రావు వ్యక్తిగత సిబ్బంది గతేడాది డిసెంబర్-17న నరేష్ పై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత మెదక్‌ జిల్లాకు చెందిన రవినాయక్‌ అనే వ్యక్తి CMRF చెక్కులు దుర్వినియోగం అయ్యాయంటూ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు నరేష్ తోపాటు మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గొడవ మొదలైంది. మంత్రి పీఏ చెక్కుల్ని దుర్వినియోగం చేశారంటూ వైరి వర్గాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. హరీష్ రావుకి కూడా సంబంధం ఉందంటూ రాద్ధాంతం చేస్తున్నాయి.

అయితే హరీష్ రావు కార్యాలయం ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. నరేష్ అనే వ్యక్తితో హరీష్ రావుకి కానీ, ఆయన కార్యాలయానికి కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. వాస్తవాలు గుర్తించకుండా తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించింది. ఒక వ్యక్తి చేసిన తప్పును, మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం బాధాకరం అని, ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు తమ కార్యాలయం సహాయం పడిందని గుర్తు చేసింది. వాస్తవాలు గుర్తించాలంటూ ప్రకటన విడుదల చేసింది.

First Published:  27 March 2024 11:26 AM GMT
Next Story