Telugu Global
Telangana

రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరో లేఖ..

బీఆర్ఎస్ హయాంలో 15రోజులకు ఓసారి బిల్లుల చెల్లింపులు జరుగుతుంటే రైతులు ఇబ్బంది లేకుండా ఉన్నారని, ఇప్పుడు అవస్థలు పడుతున్నారని చెప్పారు హరీష్ రావు.

రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరో లేఖ..
X

ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తూ ఇటీవల వరుస లేఖలు రాస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, తాజాగా మరో లేఖాస్త్రం సంధించారు. ఇందులో పాడి రైతుల కష్టాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో 2 లక్షలమంది పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.80 కోట్లు పాడి రైతులకు ప్రభుత్వం బాకీ పడిందని తన లేఖలో వివరించారు హరీష్ రావు.


అప్పుడలా.. ఇప్పుడిలా

తెలంగాణలో దాదాపు 2 లక్షల మంది పాడి రైతులు సహకార సంఘాలుగా ఏర్పడి, ప్రభుత్వం నడిపే విజయ డెయిరీకి ప్రతి రోజు పాలు సరఫరా చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు చెల్లించేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. 45 రోజుల బిల్లులు పెండింగులో ఉంటున్నాయి. తాజాగా పెండింగ్ బకాయిలు రూ.80కోట్లకు చేరుకున్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో 15రోజులకు ఓసారి బిల్లులు వస్తుంటే రైతులు ఇబ్బంది లేకుండా ఉన్నారని, ఇప్పుడు అవస్థలు పడుతున్నారని చెప్పారు.

పాడిరైతుల కష్టాలు..

బ్యాంకులు, మహిళా సంఘాలు, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చి పాడిరైతులు.. పశువులను కొలుగోలు చేస్తుంటారని, వారంతా కిస్తీలు క్రమం తప్పకుండా కట్టుకోవాల్సి ఉంటుందని.. దాణా, ఇతర మందులు, సామగ్రి కొనుగోలుకి వారికి డబ్బు అవసరం ఉంటుందని తన లేఖలో వివరించారు హరీష్ రావు. ఏరోజు కష్టంతో ఆరోజు వెళ్లదీసుకునే పాడి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ విధానంతో అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు. తీసుకున్న అప్పుకి వడ్డీ కూడా కట్టలేని పరిస్థితిలో కొందరు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గతంలో లాగే 15 రోజులకు ఓసారి బిల్లులు చెల్లించాలని కోరారు హరీష్ రావు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న బకాయిలన్నిటినీ ఒకేసారి విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

First Published:  3 April 2024 1:04 AM GMT
Next Story