Telugu Global
Telangana

ప్రతి ఇంట్లో కేసీఆర్.. హరీష్ రావు లాజిక్ ఏంటంటే..?

బీజేపీ నేతలు ఢిల్లీలో అవార్డులు ఇస్తూ గల్లీ కొచ్చి తిట్టిపోతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వం దేశం గర్వించే విధంగా ముందుకు సాగుతోందన్నారు.

ప్రతి ఇంట్లో కేసీఆర్.. హరీష్ రావు లాజిక్ ఏంటంటే..?
X

ఈసారి ఖమ్మం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ని గెలిపించి సీఎం కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇవ్వాలని ప్రజల్ని కోరారు మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లా పెనుబల్లి లో 50పడకల ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నారని చెప్పారు హరీష్ రావు. సంక్షేమ పథకం అందని ఇల్లు తెలంగాణలో ఒక్కటి కూడా లేదన్నారు. ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందుతోందని, తెలంగాణలోని ప్రజలంతా లబ్ధిదారులేనని వివరించారు. రాజకీయాలకు అతీతంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు తెలంగాణవి అని చెప్పారు హరీష్‌ రావు.




బీజేపీ నేతలు ఢిల్లీలో అవార్డులు ఇస్తూ గల్లీ కొచ్చి తిట్టిపోతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. "మా రైతు బంధుని కాపీ కొట్టి పీఎం కిసాన్ అంటివి.. మిషన్ కాకతీయ ని అమృత్ సరోవర్ పేరుతొ దేశం అంతటా అమలు చేస్తున్నావు" అంటూ ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం దేశం గర్వించే విధంగా ముందుకు సాగుతోందన్నారు హరీష్ రావు.

కేంద్రం కొర్రీలు పెట్టినా..

రాబోయే రెండు మూడు నెలల్లో సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీళ్లు తెచ్చి రెండు పంటలు పండిస్తామని అన్నారు హరీష్ రావు. కేంద్రం ఎన్ని కోర్రీలు పెట్టినా సీతమ్మ, రాములోరి దయతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. ఖమ్మం జిల్లాలో గొప్ప గొప్ప కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉన్నా ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాలేదని, కేసీఆర్ హయాంలోనే మెడికల్ కాలేజీలు వచ్చాయని గుర్తు చేశారు. కొత్తగూడెంకి ఒకటి, ఖమ్మంకి మరొకటి కాలేజీలు వచ్చాయన్నారు. ఈ జులై నుంచే ఇక్కడ డాక్టర్ కోర్సు మొదలవుతుందని చెప్పారు.

తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 2950 MBBS సీట్లు ఉంటే ఇప్పుడు 20వేలు ఉన్నాయని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్ హయాం లో 20ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ పెడితే 2ఏళ్లలో 17మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ది అని కొనియాడారు. 6నెలల క్రితం ఖమ్మం జిల్లా వాసులకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రూ.7.5 కోట్లతో కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు హరీష్ రావు.

First Published:  24 April 2023 3:47 PM GMT
Next Story