Telugu Global
Telangana

వారంతా పవర్ బ్రోకర్లు.. హరీష్ సంచలన వ్యాఖ్యలు

ఇది ఆకులు రాలే కాలం అని, మళ్లీ కొత్త చిగురు వస్తుందని, పార్టీనుంచి కొత్త నాయకత్వం వస్తుందని స్పష్టం చేశారు హరీష్ రావు.

వారంతా పవర్ బ్రోకర్లు.. హరీష్ సంచలన వ్యాఖ్యలు
X

పార్టీలు మారేవారంతా పవర్ బ్రోకర్లంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కొంత మంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు బీఆర్ఎస్ పార్టీని విడిచిపోతున్నారని అన్నారు. ఇలాంటి ఒడుదొడుకులు పార్టీకి కొత్తకాదని చెప్పారాయన. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పట్టుమని 10 మంది కూడా పార్టీలో లేరని, అయినా కేసీఆర్ ఆ 10మందితోనే తెలంగాణ తెచ్చి చూపెట్టారని అన్నారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని విమర్శించారు. నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ, ఉద్యమకారులను కొనలేరని, కార్యకర్తలను కొనలేరని అన్నారు హరీష్ రావు. వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థ ముఖ్యం అని అన్నారు.


మధ్యలో పార్టీలోకి వచ్చినవాళ్ళే పార్టీలో నుంచి వెళ్లిపోతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. పార్టీలో నుంచి వెళ్లిపోయిన వారిని రేపు కాళ్లు మొక్కినా దగ్గరకు రానివ్వొద్దని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని చెప్పుకొచ్చారు. ఇది ఆకులు రాలే కాలం అని, మళ్లీ కొత్త చిగురు వస్తుందని, పార్టీనుంచి కొత్త నాయకత్వం వస్తుందని స్పష్టం చేశారు హరీష్ రావు.

మెదక్ లోక్ సభ స్థానానికి పోటీ చేసే నాయకులు కాంగ్రెస్ లో లేరని, అందరూ వచ్చి సర్వేలు చేసుకుని పలాయనం చిత్తగించారని విమర్శించారు హరీష్ రావు. ఇక బీజేపీకి కార్యకర్తలే లేరని చెప్పారాయన. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నిజంగానే పనిమంతుడైతే దుబ్బాకలో ప్రజలు ఎందుకు ఓడిస్తారని ప్రశ్నించారు. అప్పట్లో ఉప ఎన్నికల్లో గెలిచేందుకు లెక్కకు మించి హామీలిచ్చిన రఘునందన్.. ఆ తర్వాత మాట తప్పారని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం అనుభవించారని చెప్పారు. దుబ్బాకలోనే గెలవలేని రఘునందన్ మెదక్ ఎంపీగా ఎలా గెలుస్తారని అన్నారు హరీష్ రావు.

పెద్ద నాయకులు సమన్వయంతో పని చేయాలని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు హరీష్ రావు. కష్టకాలంలో పార్టీకోసం నిలబడిన వారే నిజమైన కార్యకర్త, నిజమైన నాయకుడు అని చెప్పారు. సిద్ధిపేట అంటేనే రాష్ట్రంలో ఓ గౌరవం ఉందని, దాన్ని మనం కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మెదక్ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పారు హరీష్ రావు.

First Published:  29 March 2024 10:47 AM GMT
Next Story