Telugu Global
Telangana

ఆటో కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా..?

ఆత్మహత్య చేసుకునే ముందు ఓ ఆటో కార్మికుడు రికార్డ్ చేసిన వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దాన్ని హరీష్ రావు ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఆటో కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా..?
X

ఆర్టీసీ ఉచిత రవాణాతో మహిళలు సంతోషంగా ఉండొచ్చు కానీ, అదే సమయంలో తెలంగాణ ఆటో కార్మికులు మాత్రం ఉపాధి కరువై అల్లాడిపోతున్నారు. సడన్ గా వేరే ఉపాధి వెతుక్కోలేరు, అదే సమయంలో ఉన్న ఆటోను తెగనమ్ముకోనూ లేరు. కుటుంబ పోషణ భారమై పదుల సంఖ్యలో ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆటో కార్మికుల పక్షాన పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు మాజీ మత్రి హరీష్ రావు. ఆత్మహత్య చేసుకునే ముందు ఓ ఆటో కార్మికుడు రికార్డ్ చేసిన వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దాన్ని హరీష్ రావు ట్విట్టర్ లో షేర్ చేశారు.


ఆటోలు నడవటం లేదనే మనస్తాపంతో, బతుకు భారమై భార్యతో సహా, ప్రాణాలు కోల్పోయిన ఆటో సోదరుడి దీనగాధ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరం అని అన్నారు హరీష్ రావు. తల్లి, తండ్రిని కోల్పోయి, అనాధగా మారిన ఆ బిడ్డ భవిష్యత్ కు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి రూ.10లక్షలు ఆర్థిక సాయం చేయాలని, ఆ కుటుంబానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

ఆటో సోదరులకు విజ్ఞప్తి..

ఉపాధి కోల్పోయిన ఆటో సోదరులకు ప్రభుత్వం వెంటనే రూ. 12వేలు భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఆటో కార్మికుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆటో సోదరులు ధైర్యంగా ఉండాలని, తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

First Published:  15 March 2024 6:05 AM GMT
Next Story