Telugu Global
Telangana

రాహుల్ కాంగ్రెస్ వర్సెస్ రేవంత్ కాంగ్రెస్

కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీజేపీకి ఉపయోగపడుతుందని, బీఆర్‌ఎస్‌కు వేస్తే మీ భద్రతకు గ్యారంటీ ఉంటుందని హామీ ఇచ్చారు హరీష్ రావు.

రాహుల్ కాంగ్రెస్ వర్సెస్ రేవంత్ కాంగ్రెస్
X

తెలంగాణలో ఉన్నది రాహుల్ కాంగ్రెస్ కాదని, రేవంత్ కాంగ్రెస్ అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ ఒరిజినల్ కాంగ్రెస్ కాదన్నారు. రేవంత్ ఎజెండా వేరు రాహుల్ ఎజెండా వేరు అని చెప్పారు. గుజరాత్ అనగానే అందరికీ గోద్రా గుర్తొస్తుందని, కానీ గుజరాత్ మోడల్ అంటూ రేవంత్ రెడ్డి పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు.


మైనార్టీ మంత్రి ఎందుకు లేరు..?

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి మైనార్టీల పాత్ర కూడా ఉందని, మరి మంత్రి వర్గంలోకి మైనార్టీని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు హరీష్ రావు. గతంలో ముస్లిం మంత్రి లేకుండా ఏ మంత్రి వర్గమైనా ఉందా? అని అడిగారు. ఎమ్మెల్యే ఎవరూ లేకపోయినా, ఎమ్మెల్సీ ఇచ్చిమరీ మైనార్టీకి మంత్రి పదవి కేసీఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆగస్టు 15 న కొందరని మంత్రివర్గంలోకి తీసుకుంటానని రేవంత్ చెబుతున్నారే కానీ, ముస్లింల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

మోదీకి వ్యతిరేకంగా కొట్లాడే వారిపై రేవంత్ కావాలనే బీజేపీ ముద్ర వేస్తారని మండిపడ్డారు హరీష్ రావు. కేరళలో సీపీఎం సీఎం పినరయి విజయన్‌ ను కూడా బీజేపీ తొత్తు అని రేవంత్ అంటున్నారని, సీపీఎం ఏనాడైనా బీజేపీతో కలుస్తుందా? అని ప్రశ్నించారు. రేవంత్ పుకార్లు ఆసెంబ్లీ ఎన్నికల్లో కొంత నమ్మారని, ఇప్పుడు అందరికీ నిజాలు తెలిశాయని, ఈ సారి పొరపాటున కూడా నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీజేపీకి ఉపయోగపడుతుందని, బీఆర్‌ఎస్‌కు వేస్తే మీ భద్రతకు గ్యారంటీ ఉంటుందని హామీ ఇచ్చారు హరీష్ రావు.

జహీరాబాద్‌లో ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి పాల్గొన్న హరీష్ రావు.. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అమలు చేసిన ఉచిత బస్సు హమీ తప్ప మొత్తం 13 హమీలూ తుస్సేనన్నారు. రైతులకిచ్చిన ఆరు గ్యారంటీలు మోసం అన్నారు. మహిళలకు, వృద్ధులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు మోసం అని చెప్పారు. రాష్ట్రంలో వచ్చిన కరువు కాలం తెచ్చిన కరువు కాదని, రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అయినా పంటలు ఎండిపోతున్నాయంటే, అది ప్రభుత్వ చేతగానితనం అని చెప్పారు. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని, ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని, రైతులు నిలదీస్తారని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారా అని ప్రశ్నించారు హరీష్ రావు.

First Published:  20 April 2024 3:03 AM GMT
Next Story