Telugu Global
Telangana

చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన పోరాటం

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు హరీష్ రావు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకు రావాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన పోరాటం
X

కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రైతాంగం అవస్థలు పడుతోందనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. రుణమాఫీ, రైతుబంధు, బోనస్ పేరుతో రైతుల్ని సీఎం రేవంత్ రెడ్డి దారుణంగా మోసం చేశారని అంటున్నారు. వడ్లకు కాంగ్రెస్ ఇస్తానన్న బోనస్ విషయంలో రైతులకు అండగా ఉంటామని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు కష్టకాలంలో అండగా నిలవాలని, చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన పోరాడాలని ఆయన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అన్నదాతలను ఆగం చేస్తూ అరిగోస పెట్టిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు హరీష్ రావు. రోజుకోమాట మారుస్తూ మోసం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కోరారు. వడ్లకు కాంగ్రెస్‌ ఇస్తానన్న రూ.500 బోనస్‌పై రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా నిలువాలన్నారు. బీఆర్ఎస్ తరపున ఒత్తిడి తెస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు హరీష్ రావు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు హరీష్ రావు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకు రావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలని, రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. మిల్లర్లు, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులను సమన్వయం చేస్తూ వడ్లు కోనేలా చూడాలన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. సిద్ధిపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన హరీష్ రావు.. పలు కీలక సూచనలు చేశారు.

First Published:  19 May 2024 1:42 AM GMT
Next Story