Telugu Global
Telangana

కాంగ్రెస్ అలసత్వం.. తెలంగాణకు శాపం

2021 లోనే KRMB పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తేవాలని కేంద్రం ప్రతిపాదించిందని, ఆ ప్రతిపాదనను కేసీఆర్ గట్టిగా వ్యతిరేకించారని గుర్తు చేశారు హరీష్ రావు.

కాంగ్రెస్ అలసత్వం.. తెలంగాణకు శాపం
X

ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఢిల్లీ లో జరిగిన ఉన్నత స్థాయి మీటింగ్‌లో ఇదే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోందని, అలా జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం అని అన్నారాయన. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది గులాబీ జెండానేనని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడుకుందామని, ఆ తర్వాత అభివృద్ధిపై చర్చించాలన్నారు హరీష్ రావు.


పాలమూరు -రంగారెడ్డి కి జాతీయ హోదా కేంద్రం ఇవ్వనంటే, కాంగ్రెస్ ఒప్పుకుందని.. అలాగే ఉమ్మడి ప్రాజెక్ట్ లను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ (KRMB) పరిధిలోకి తెస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అనిపిస్తోందన్నారు హరీష్ రావు. 2021 లోనే KRMB పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తేవాలని కేంద్రం ప్రతిపాదించిందని, ఆ ప్రతిపాదనను కేసీఆర్ గట్టిగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో ఇంకా తెలంగాణ వాటా తేలనప్పుడు KRMB పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా తెస్తారని ప్రశ్నించారు హరీష్ రావు. KRMB పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తెస్తే జల విద్యుత్ ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ ఎడమ గట్టు కాలువ ఆయకట్టు పై కూడా KRMB ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు తాగు నీళ్లకు కూడా కటకట ఏర్పడుతుందన్నారు. అది తెలంగాణకు ఆత్మహత్యా సదృశ్యమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. రాజకీయం మాని రాష్ట్రానికి జరిగే నష్టం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలన్నారు హరీష్ రావు.

ఫేక్ వార్తలతో దుష్ప్రచారం..

కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద సాగయ్యే భూములకు వెంటనే నీటిని విడుదల చేయా లన్నారు హరీష్ రావు. కాళేశ్వరం పంపులను సాంకేతికంగా 24 గంటలు నడపాలని.. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో మోటార్లు నడప కూడదన్నారు. కాళేశ్వరంపై రోజుకో ఫేక్ వార్తను బయటకు తెస్తూ తమపై బురదజల్లాలనుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వాటి కోసం ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు హరీష్ రావు

First Published:  19 Jan 2024 12:08 PM GMT
Next Story