Telugu Global
Telangana

డీకే, పీకే వచ్చినా మా ఏకే-47 కేసీఆర్ ని ఏం చేయలేరు

గతుకుల గజ్వేల్‌ ను బతుకుల గజ్వేల్‌ గా కేసీఆర్‌ మార్చారన్నారు హరీష్ రావు. విద్యాలయాలకు, రిజర్వాయర్లకు నిలయంగా నేడు గజ్వేల్ మారిందని, దేశ విదేశాలనుంచి సైతం ప్రతినిధులు గజ్వేల్‌ కు వచ్చి ఇక్కడ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారని తెలిపారు.

డీకే, పీకే వచ్చినా మా ఏకే-47 కేసీఆర్ ని ఏం చేయలేరు
X

కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చినా, ఏపీ నుంచి పవన్ కల్యాణ్ (పీకే) వచ్చినా మా ఏకే-47 కేసీఈర్ ని ఏం చేయలేరు అని అన్నారు మంత్రి హరీష్ రావు. 2014, 2018లో కూడా ఎన్నికల ప్రచార ముగింపు సభలు గజ్వేల్‌ లో నిర్వహించామని, ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తున్నామని, రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధిస్తామని చెప్పారు. కేసీఆర్‌ కు ఓటు వేసి రుణం తీర్చుకునేందుకు గజ్వేల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలే కాదు ప్రజలు కోరని పనులను కూడా గజ్వేల్‌ లో సీఎం పూర్తి చేశారన్నారు. కరవు పీడిత ప్రాంతమైన గజ్వేల్ నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమయిందని తెలిపారు హరీష్ రావు.

పెద్దవాళ్లపై పోటీ చేస్తే పెద్దవాళ్లం అవుతామని కొంతమంది అనుకుంటున్నారని, పరోక్షంగా ఈటల రాజేందర్ పై సెటైర్లు వేశారు హరీష్ రావు. కేసీఆర్‌ కి సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరన్నారు. జీవితాన్ని ఫణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ సాధించారని, ఆయనకు ఇంకెవరు పోటీ వచ్చినా అది నామ మాత్రమేనని చెప్పారు. మా ముఖ్యమంత్రి మా నియోజకవర్గ ఎమ్మెల్యే అని గజ్వేల్ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు హరీష్. వేరే వాళ్లు ఉంటే ఆ గౌరవం గజ్వేల్‌ కు ఉంటుందా? అని ప్రశ్నించారు. పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని షో చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఈటల నామినేషన్ కోసం వచ్చిన జనం ఎక్కడినుంచి వచ్చారో అందరికీ తెలుసని పరోక్షంగా సెటైర్లు వేశారు హరీష్ రావు.

గతుకుల గజ్వేల్‌ ను బతుకుల గజ్వేల్‌ గా కేసీఆర్‌ మార్చారన్నారు హరీష్ రావు. విద్యాలయాలకు, రిజర్వాయర్లకు నిలయంగా నేడు గజ్వేల్ మారిందని, దేశ విదేశాలనుంచి సైతం ప్రతినిధులు గజ్వేల్‌ కు వచ్చి ఇక్కడ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారని తెలిపారు. కోకాకోలా, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్ రావడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని చెప్పారు. గజ్వేల్ చరిత్రలోనే ఈసారి అత్యథిక మెజార్టీ కేసీఆర్ కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు హరీష్ రావు.

ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తెలంగాణ ద్రోహుల చేతుల్లో అధికారం పెడితే ఆగం అవుతామన్నారు హరీష్ రావు. రాష్ట్రాన్ని దయ్యాల పాలు చేయొద్దని చెప్పారు. రిస్క్ లేకుండా తాగునీరు, సాగునీరు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు వస్తున్నాయని, మరి రిస్క్ తీసుకొని వేరే పార్టీకి ఓటు వేయడం ఎందుకు? అని ప్రశ్నించారు.

First Published:  9 Nov 2023 5:15 AM GMT
Next Story