Telugu Global
Telangana

కొడుకు హంతకుడు.. ఆ తండ్రి మాటలు వింటే కన్నీళ్లాగవు..

చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందేనన్నాడు. అయితే లోలోపల కుంగిపోయాడు. కొడుకు హంతకుడిగా మారినందుకు మానసిక క్షోభ అనుభవించాడు.

కొడుకు హంతకుడు.. ఆ తండ్రి మాటలు వింటే కన్నీళ్లాగవు..
X

కన్నబిడ్డలు తప్పు చేసినా దాన్ని దాచిపెట్టడానికే ప్రయత్నిస్తారు ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు. కానీ ఆ తండ్రి న్యాయం వైపు నిలబడ్డాడు. హత్య చేసి వచ్చానని కొడుకు చెప్పగానే, వెళ్లి పోలీసులకు లొంగిపోవాలని సూచించాడు. హంతకుడికి ఎలాంటి శిక్ష పడుతుందో తెలిసి కూడా కొడుకు చట్టాన్ని అతిక్రమించకూడదని అనుకున్నాడు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందేనన్నాడు. అయితే లోలోపల కుంగిపోయాడు. కొడుకు హంతకుడిగా మారినందుకు మానసిక క్షోభ అనుభవించాడు.

ప్రాణ స్నేహితుడైన నవీన్ ని, ప్రేయసి కోసం హరిహరకృష్ణ అనే యువకుడు అతి కిరాతకంగా హత్య చేయడం, శరీర భాగాలను వేరు చేసి ఆ అమ్మాయి సహా మరికొంతమందికి వాట్సప్ లో ఫొటోలు పంపడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హరిహరకృష్ణ నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. హైదరాబాద్ లో హత్య తర్వాత వరంగల్ లోని తన ఇంటికి వెళ్లిన హరిహరకృష్ణను తండ్రి నిలదీశాడు. దీంతో తన స్నేహితుడిని చంపిన విషయాన్ని తండ్రికి చెప్పాడు. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని సూచించాడు తండ్రి ప్రభాకర్. ఆయన మాట ప్రకారం కొడుకు హైదరాబాద్ వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.

మమ్మల్ని క్షమించండి..

తన కొడుకు చేసిన తప్పుకి క్షమాపణ ఉండదని, కానీ తమ కుటుంబాన్ని క్షమించాలని బాధిత నవీన్ కుటుంబాన్ని వేడుకున్నాడు హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్. నవీన్ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. అదే సమయంలో ప్రేమ పేరుతో జీవితాలు పాడు చేసుకోవద్దని యువతకు సూచించారు. నవీన్, హరిహరకృష్ణ ప్రాణ స్నేహితులైనా.. చివరకు ఓ అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య వైరం మొదలైంది. చివరకు అది హత్యకు దారి తీసింది. నవీన్ చనిపోవడంతో అతడి కుటుంబం అల్లాడిపోతోంది, ఇటు హరిహరకృష్ణ జైలుపాలవడంతో ఈ కుటుంబం కూడా కుంగిపోయింది. దీనంతటికీ కారణం ఓ అమ్మాయి, ఆమె ప్రేమ కావడం గమనార్హం. హరి హర కృష్ణ, నవీన్‌ ఇద్దరు ఇంటర్ నుంచి మంచి స్నేహితులే.. కానీ, ఒక అమ్మాయి మూలంగా ఇద్దరు జీవితాలు పాడైపోయాయంటూ కన్నీరుమున్నీరయ్యారు హరిహర కృష్ణ తండ్రి ప్రభాకర్‌.

First Published:  26 Feb 2023 3:59 AM GMT
Next Story