Telugu Global
Telangana

మిషన్ భగీరథ స్పూర్తితోనే హర్ ఘర్ జల్ : మంత్రి కేటీఆర్

దేశంలోనే తొలిసారి తెలంగాణ రాష్ట్రం మాత్రమే ప్రతీ ఇంటికి నల్లా ద్వారా నీటిని సరఫరా చేసిందని తెలిపారు.

మిషన్ భగీరథ స్పూర్తితోనే హర్ ఘర్ జల్ : మంత్రి కేటీఆర్
X

దేశంలో ప్రతీ ఇంటికి 100 శాతం ట్యాప్ వాటర్ అందిస్తున్న రాష్ట్రాల జాబితాను ది ఇండియన్ ఇండెక్స్ అనే సంస్థ తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేసింది. ఇందులో తెలంగాణ సహా మరో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఇంటింటికీ మంచి నీరు అందిస్తున్నదని ది ఇండియన్ ఇండెక్స్ తెలిపింది. దీనిని రీ ట్వీట్ చేస్తూ మంత్రి కేటీఆర్ మిషన్ భగీరథ విజయాన్ని చెప్పుకొచ్చారు.

దేశంలోనే తొలిసారి తెలంగాణ రాష్ట్రం మాత్రమే ప్రతీ ఇంటికి నల్లా ద్వారా నీటిని సరఫరా చేసిందని తెలిపారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ పథకం ద్వారా నేడు తెలంగాణలోని ఇంటింటికీ మంచి నీరు అందుతోందని చెప్పారు. తెలంగాణ సమర్థవంతంగా పూర్తి చేసిన మిషన్ భగీరథ స్పూర్తితోనే కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ విజన్ వల్లే మిషన్ భగీరథ పూర్తయ్యిందని.. ఈ రోజు తెలంగాణ ఏది చేస్తే.. దేశం దాన్ని అనుసరిస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రతీ ఇంటికి ట్యాప్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో 2016 ఆగస్టు 6న గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ గ్రామంలో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఎం మోడీతో పాటు సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి ట్యాప్ వాటర్ అందించడం ద్వారా ఫ్లోరైడ్ బాధిత గ్రామాలే లేకుండా పోయాయి. ఈ పథకం ద్వారా నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు అత్యధికంగా లబ్ది పొందుతున్నట్లు తెలంగాణ స్టేట్ స్టాటస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ ఇండెక్స్ 2021 తెలిపింది.


First Published:  12 Oct 2023 6:41 AM GMT
Next Story