Telugu Global
Telangana

చేనేత రుణ మాఫీ కూడా సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంది : మంత్రి కేటీఆర్

నేతన్నల కష్టాలు సీఎం కేసీఆర్‌కు తెలుసు. తన చిన్నప్పుడు ఒక నేతన్న ఇంట్లో ఉండి చదువుకున్నారు. అందుకే చేనేత కార్మికుల విషయంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మంత్రి కేటీఆర్ చెప్పారు

చేనేత రుణ మాఫీ కూడా సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంది : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించి.. ఇప్పటికే అమలు చేస్తున్నది. మాకు కూడా రుణ మాఫీ అమలు చేయరా అని నేతన్నలు అడుగుతున్నారు. గతంలో చేనేత కార్మికులకు వ్యక్తిగతంగా రుణాలు మాఫీ చేశాం. ఇప్పుడు కూడా నేతన్నల రుణాలను మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. నేను, మంత్రి జగదీశ్ రెడ్డి ఈ విషయాన్ని తప్పకుండా సీఎం దృష్టికి తీసుకొని వెళ్తామని పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..

నేతన్నల కష్టాలు సీఎం కేసీఆర్‌కు తెలుసు. తన చిన్నప్పుడు ఒక నేతన్న ఇంట్లో ఉండి చదువుకున్నారు. అందుకే చేనేత కార్మికుల విషయంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దేశంలోనే రైతు బీమా తరహాలో నేతన్నలకు బీమా సౌకర్యం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని మంత్రి కేటీఆర్ అన్నారు. కనుముక్కులలో మూతబడిన హ్యాండ్లూమ్ పార్కును ప్రభుత్వమే రూ.12 కోట్లతో కొనుగోలు చేసి త్వరలోనే ప్రారంభించనున్నది. చేనేత కార్మికులకు వచ్చే నెల నుంచే రూ.3 వేలు నేరుగా అకౌంట్లలో పడనున్నాయి. దీంతో చేనేత కార్మికులకు ప్రతీ నెల పెట్టుబడి సాయం రానున్నది. రాబోయే రోజుల్లో 59 ఏళ్ల వరకు చేనేత కార్మికులకు ఎల్ఐసీ ద్వారా, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ద్వారా బీమా అమలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.

ప్రధాని మోడీ రద్దు చేసిన ఐసీఐసీఐ లాంబార్డ్ సేవలను.. ఇప్పుడు స్వయంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్నది. నేతన్నలకు హెల్త్ కార్డులు అందించనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ నేతన్నలు ఉన్నా.. వారికి ఈ హెల్త్ కార్డులు అందనున్నాయి. మగ్గాలను కూడా ఆధునీకరించుకోవాల్సి అవసరం ఉన్నది. అందుకే రూ.40 కోట్లతో తెలంగాణ చేనేత మగ్గం అనే పథకం తీసుకొచ్చాంది. దీన్ని ఉపయోగించుకొని గుంట మగ్గాల స్థానంలో కొత్త ఫ్రేమ్ లూమ్స్ తీసుకొని రావాలని మంత్రి కేటీఆర్ సూచించారు. టెస్కో ద్వారా నేతన్నలకు అందరికీ ఐటీ కార్డులు ఇస్తున్నాము. దీని ద్వారా ప్రతీ ఒక్కరికీ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందుతాయని మంత్రి చెప్పారు.

గతంలో చేనేత కార్మికుడు చనిపోతే రూ.5 వేలను దహన సంస్కారాల కోసం ఇచ్చేవాళ్లం. కానీ ఇకపై టెస్కో ద్వారా రూ.25 వేలు ఇవ్వబోతున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌లో వచ్చే లాభాలు ప్రతీ నేత కుటుంబానికి ఇవ్వనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి ఇచ్చే రంగం చేనేత రంగమే. మన తెలంగాణ నేతన్నలకు ఎంతో టాలెంట్ ఉంది. అందుకే చేనేత కార్మికులను కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తూ చేనేతలను కాపాడుకుంటుంటే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం నేతన్నలకు అందే ప్రతీ ప్రయోజనాన్ని రద్దు చేసింది. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని నష్టాన్ని.. మోడీ ప్రభుత్వం చేసింది. చేనేతపై జీఎస్టీ వేసిన ప్రభుత్వం.. ఒకే ఒక మోడీ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ చెప్పారు. చేనేతపై జీఎస్టీ 5 శాతం రద్దు కావాలంటే మోడీ ప్రభుత్వం దిగిపోవాలని కేటీఆర్ అన్నారు. కేంద్రం మెడలు వంచే కేసీఆర్ వంటి నాయకులు ఉండాలి. పార్లమెంటులో మన ఎంపీలు ఉండాలని కేటీఆర్ అన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రం, కేంద్రంలో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్..

భూదాన్ పోచంపల్లి ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత కాలాపునర్వి హ్యాండ్లూమ్, సైనీ భారత్ ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్లను కేటీఆర్ సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న హ్యాండ్లూమ్ పార్కుకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. రూ.100 కోట్లతో చేపట్టనున్న దోభీఘాట్, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

First Published:  12 Aug 2023 8:49 AM GMT
Next Story