Telugu Global
Telangana

దత్త పుత్రికా నీతులు చెప్పొద్దు..

అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా ఐఏఎస్ అధికారులను సైతం జైలుకు పంపిన చరిత్ర వారిదని విమర్శించారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి. షర్మిల ఎపిసోడ్ పై ఆయన తీవ్రంగా స్పందించారు.

దత్త పుత్రికా నీతులు చెప్పొద్దు..
X

దత్తపుత్రిక పాదయాత్ర చేస్తూ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తోందని విమర్శించారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అధికారులను జైలులో పెట్టేలా అవినీతి చేసింది దత్త పుత్రిక కుటుంబం కాదా అని ప్రశ్నించారాయన. ఆ దత్తపుత్రిక ఇక్కడకు వచ్చి నీతులు మాట్లాడుతోందని, ఆ కుటుంబం ఎలాంటిదో, వారి హయాంలో ఎలాంటి పాలన జరిగిందో అందరికీ తెలుసన్నారు. అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా ఐఏఎస్ అధికారులను సైతం జైలుకు పంపిన చరిత్ర వారిదని విమర్శించారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి. షర్మిల ఎపిసోడ్ పై ఆయన తీవ్రంగా స్పందించారు.

తెలంగాణపై సమైక్యవాదుల కన్ను..

తెలంగాణపై సమైక్యవాదుల కన్నుపడిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఏడాది కాలంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్ర దాగుందని పేర్కొన్నారు. కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజలను మభ్య పెట్టి కేసీఆర్ ను అడ్డు తొలగించుకొని, మళ్లీ తెలంగాణను కబ్జా చేసేందుకు వస్తున్నారని ఆరోపించారు.

మండలాల విలీనంతో మొదలు..

తెలంగాణపై సమైక్యవాదుల పెత్తనం 2014 లో ఏడు మండలాల విలీనంతో మొదలైందని అన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. మోదీ ప్రధాని అయిన తర్వాత ఏడు మండలాలను తెలంగాణ నుంచి విడదీసి ఏపీలో కలిపారని చెప్పారు. దేశంలో ప్రభుత్వాలను కూల్చేకుట్రలు, అనిశ్చితకరమైన వాతావరణం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందుకే ప్రధాని కన్ను తెలంగాణపై పడిందని, ఈ సంతోషకరమైన వాతావరణాన్ని వారు చెడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు గుత్తా. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని తేల్చి చెప్పారు.

First Published:  2 Dec 2022 10:18 AM GMT
Next Story