Telugu Global
Telangana

కోమ‌టిరెడ్డి ఇలాకాలో కాల్పుల క‌ల‌క‌లం!

మునుగోడు లో ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్వగ్రామం అయిన బ్రాహ్మ‌ణ‌వెల్లెంల గ్రామానికి చెందిన లింగస్వామి అనే వ్య‌క్తిపై గురువారం రాత్రి గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్పులు జ‌రిపారు.

కోమ‌టిరెడ్డి ఇలాకాలో కాల్పుల క‌ల‌క‌లం!
X

ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల రెడ్డి రాజీనామాతో తెలంగాణ‌లో కేంద్ర‌బిందువుగా మారిన మునుగోడులో తాజాగా తుపాకి కాల్పులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. రాజ‌గోపాల‌రెడ్డి స్వ‌స్థ‌లం బ్రాహ్మ‌ణ‌వెల్లెంల గ్రామానికి చెందిన లింగస్వామి అనే వ్య‌క్తిపై గురువారం రాత్రి గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా ఈ కాల్పుల సంఘ‌ట‌నతో ఆ ప్రాంతం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. ఈ సంఘ‌ట‌న వెన‌క రాజ‌కీయ కోణాలు ఉండొచ్చ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ పోలీసులు వాటిని తోసిపుచ్చుతున్నారు. రాజ‌కీయంగా వేడెక్కిన మునుగోడులో తాజా సంఘ‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఈ సంఘ‌ట‌న‌కు సంబందించి వివ‌రాలిలా ఉన్నాయి. మునుగోడు మండలం ఊకొండి సమీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తోన్న నిమ్మల లింగస్వామిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జర‌ప‌డంతో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మొత్తం మూడు రౌండ్లు కాల్చారని పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే ఊకొండి గ్రామ సర్పంచ్ సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయ‌ప‌డిన వ్య‌క్తిని ఆసుపత్రికి తరలించారు.

నిమ్మల లింగస్వామి మునుగోడులో వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నాడు. ఇదివరకు రెంటల్ సర్వీస్ కింద ఓ వాహనాన్ని నడిపించాడు. అందులో నష్టం రావడంతో వాటర్‌ ప్లాంటు నిర్వహిస్తున్నాడు. రోజూ బ్రాహ్మణవెల్లంల నుంచి మునుగోడు మండల కేంద్రానికి బైక్‌పై వెళ్ళి వ‌స్తుంటాడు. ఎప్ప‌టిలాగానే రాత్రి త‌న ప‌నులు ముగించుకుని మునుగోడు నుంచి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఊకొండి క్రాస్ రోడ్ వద్దకు రాగానే.. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. బుల్లెట్‌పై వచ్చిన వారు వెనుక నుంచి కాల్పులు జరిపార‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో లింగస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల శబ్దం విని స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగులు పారిపోయారు.

పోలీసులు కేసు నమోదు చేశారు. కాల్పులు జరపడానికి గల కారణాలపై దర్యాప్తు సాగిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వగ్రామానికి చెందిన వ్యక్తిపై కాల్పులు చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యాన్నిసంతరించుకుంది. కాగా రాజ‌కీయంగా హీటెక్కిన ప్ర‌స్తుత స‌మ‌యంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఎన్ని రాజ‌కీయ మ‌లుపులు తిరుగుతుందోన‌ని అనుకుంటున్నారు.

Next Story