Telugu Global
Telangana

వీఆర్ఏల కేటాయింపునకు మార్గదర్శకాలు జారీ.. త్వరలోనే ఇతర శాఖలకు బదిలీలు

ప్రభుత్వ నిర్ణయం మేరకు వీఆర్ఏల అర్హతలను బట్టి లాస్ట్ గ్రేడ్ సర్వీస్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి బాధ్యతలను కేటాయించనున్నారు.

వీఆర్ఏల కేటాయింపునకు మార్గదర్శకాలు జారీ.. త్వరలోనే ఇతర శాఖలకు బదిలీలు
X

రెవెన్యూ శాఖలో కింది స్థాయిలో సేవలు అందించిన వీఆర్ఏల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని గతంలోనే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారిని క్రమబద్దీకరించి.. ఇతర శాఖల్లో సర్ధుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వీఆర్ఏలను ఇతర శాఖలకు పంపేందుకు మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. జిల్లాలు, శాఖలు, పోస్టు కేటాయించేందుకు అవసరమైన సమాచారాన్ని పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.

ప్రభుత్వ నిర్ణయం మేరకు వీఆర్ఏల అర్హతలను బట్టి లాస్ట్ గ్రేడ్ సర్వీస్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి బాధ్యతలను కేటాయించనున్నారు. శాఖల వారీగా, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను జిల్లా కలెక్టర్లు వెంటనే పంపాల్సి ఉంటుంది. వీఆర్ఏలతో పాటు 61 ఏళ్లు నిండిన వీఆర్ఏలు ఉంటే వారి వారసులకు శాఖల కేటాయింపు ప్రక్రియను తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చేపట్టాలని చెప్పారు.

వీఆర్ఏల వయసును ఈ ఏడాది జూన్ 31ని ప్రామాణికంగా తీసుకోనున్నారు. తెలంగాణ స్టేట్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం కారుణ్య నియామకాలు చేపడతారు. ఇప్పటికే వీఆర్ఏల అర్హతలను బట్టి జిల్లాల వారీగా రెగ్యులర్, సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల ఆధారంగానే వీఆర్ఏల కేటాయింపు ఉంటుంది. ఒక వేళ ఎవరినైనా ఇతర జిల్లాలకు కేటాయిస్తే ఆ జాబితాను కూడా విడుదల చేయాలని నవీన్ మిట్టల్ ఆదేశించారు.

వీఆర్ఏల కేటాయింపుపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు రిపోర్టు చేయవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వీఆర్ఏల నియామకపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే.. ఆయా మండలాల తహశీల్దారులు వారిని రిలీవ్ చేయాలని పేర్కొన్నారు. ఒకసారి నియామక ఉత్తర్వులు జారీ అయిన తర్వాత.. ఎలాంటి సిఫార్సులు చెల్లవని పేర్కొన్నారు. అందరూ తమకు కేటాయించినట్లుగా రిపోర్టింగ్ ఆఫీసర్‌కు రిపోర్ట్ చేయాలని, 61 ఏళ్లు నిండిన వారు తమ కుటుంబ సభ్యుల ఎన్వోసీ పత్రాలను సమర్పించాలని పేర్కొన్నారు.

కారుణ్య నియామకాల ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. వీఆర్ఏల సర్ధుబాటు ప్రక్రియ మొత్తం ఈ నెల ఐదో తేదీలోపు పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

First Published:  2 Aug 2023 2:39 AM GMT
Next Story