Telugu Global
Telangana

TSPSC Group 4 Notification: త్వరలో గ్రూప్-4, స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ : మంత్రి హరీశ్ రావు

TSPSC Group 4 Notification 2022: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, స్టాఫ్ నర్సుల పోస్టులకు 10 రోజుల్లోపు నోటిఫికేషన్ జారీ అవుతుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

TSPSC Group 4 Notification: త్వరలో గ్రూప్-4, స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ : మంత్రి హరీశ్ రావు
X

TSPSC Group 4 Notification: త్వరలో గ్రూప్-4, స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ : మంత్రి హరీశ్ రావు

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే గ్రూప్-4తో పాటు ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. గత కొంత కాలంగా పలు శాఖల్లో ఉన్న ఖాళీలపై అధికారులు కసరత్తు చేశారని, ఇప్పుడు వాటిని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. త్వరలో గ్రూప్-4తో పాటు మరో 2వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు కేటాయించనున్నట్లు హరీశ్ రావు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, స్టాఫ్ నర్సుల పోస్టులకు 10 రోజుల్లోపు నోటిఫికేషన్ జారీ అవుతుందని మంత్రి చెప్పారు. వీటిలో 1165 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 6 వేలకు పైగా స్టాఫ్ నర్సు పోస్టులు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఇక పల్లె దవాఖానాల్లో డాక్టర్లను కూడా నియమించనున్నామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 3800 ఏఎన్ఎం కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మార్చనున్నట్లు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక కారణంగానే డాక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలిపారు. ఇప్పటికే 969 సివిల్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.

డీపీహెచ్ పరిధిలో 751, టీవీవీపీ పరిధిలో 211, ఐపీఎం పరిధిలో 7 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. వీరందరికీ మరో పది రోజుల్లో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తామన్నారు. ఇక సిద్ధిపేటలో ఉన్న కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ గురించిన వివరాలు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 1030 మందికి శిక్షణ ఇవ్వగా.. 580 మంది ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించినట్లు మంత్రి చెప్పారు. ఉచిత శిక్షణ కేంద్రంలో ఫిట్‌నెస్ శిక్షణ పొందుతున్న వారికి పాలు, పండ్లు పంపిణీ చేశారు.

ఆర్మీలో శాశ్వత నియామకాలు చేయడం ఇష్టం లేకనే అగ్నిపథ్ పేరుతో తాత్కాలిక నియామకాలు చేస్తోందని ఆరోపించారు. అగ్నిపథ్ పేరుతో నిరుద్యోగులను మోడీ ప్రభుత్వం నిండా ముంచిందని చెప్పారు. నాలుగేళ్లు ఆర్మీలో పని చేసిన తర్వాత ఉద్యోగులు పోగొట్టుకునే వాళ్లు.. ఆ తర్వాత బ్యాంకులు, ఆసుపత్రుల ముందు సెక్యూరిటీ గార్డులుగా పని చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం తమ పరిధిలో భారీగా ఉద్యోగ నియామకాలు చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

First Published:  13 Nov 2022 7:38 AM GMT
Next Story