Telugu Global
Telangana

గ్రూప్-2 పరీక్ష నవంబర్‌కు వాయిదా.. రీషెడ్యూల్ చేయాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశం

గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్.. వెంటనే పరీక్షను వాయిదా వేయాలని సీఎస్‌ను ఆదేశించారు.

గ్రూప్-2 పరీక్ష నవంబర్‌కు వాయిదా.. రీషెడ్యూల్ చేయాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశం
X

గ్రూప్-2 పరీక్ష రాసే అభ్యర్థులకు ఊరట కలిగించే వార్తను సీఎం కేసీఆర్ చెప్పారు. వరుసగా పలు పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో.. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేదుకు గాను టీఎస్‌పీఎస్సీతో చర్చించి పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టీఎస్‌పీఎస్సీతో చర్చలు జరిపారు.

ఆగస్టు 2 నుంచి 30 వరకు వరుసగా 21 పోటీ పరీక్షలు ఉన్నాయని.. ముఖ్యంగా 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష కూడా ఉండటంతో అభ్యర్థులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై కొంత మంది హైకోర్టును కూడా ఆశ్రయించడంతో.. 14వ తేదీలోగా తగిన నిర్ణయం తీసుకోవాలని టీఎస్‌పీస్సీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్.. వెంటనే పరీక్షను వాయిదా వేయాలని సీఎస్‌ను ఆదేశించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హుటాహుటిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్, కార్యదర్శితో చర్చించారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్షను నవంబర్‌కు వాయిదా వేయాలని నిర్ణయించారు. అంతే కాకుండా భవిష్యత్‌లో పరీక్షల నోటిఫికేషన్లు జారీ చేసే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ చేసిన సూచనను పాటించాలని టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు.

గ్రూప్-2 పరీక్ష విషయంలో సీఎస్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించిన విషయాన్ని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా ధృవీకరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'గ్రూప్-2 పరీక్ష రీషెడ్యూల్ విషయమై సీఎస్‌తో సీఎం కేసీఆర్ చర్చించారు. అభ్యర్థులకు ఆటంకం లేకుండా పరీక్షను రీషెడ్యూల్ చేసేలా టీఎస్‌పీఎస్సీతో చర్చించాలని సీఎస్‌ను ఆదేశించారు. భవిష్యత్‌లో కూడా ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రతీ అభ్యర్థి.. ప్రతీ పరీక్షకు హాజరయ్యేందుకు, సన్నద్దమయ్యేందుకు సరిపడా సమయం ఇచ్చేలా నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎస్‌ను ఆదేశించారు' అని కేటీఆర్ ట్వీట్ చేశారు. గ్రూప్-2 విషయంలో ఒక క్లారిటీ రావడంతో సోమవారం నాడు హైకోర్టులో జరగనున్న విచారణ నామమాత్రమే కానున్నది.


First Published:  12 Aug 2023 6:15 PM GMT
Next Story