Telugu Global
Telangana

నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్.. ఆ నలుగురు నిందితులకు పరీక్ష రాసే ఛాన్స్

పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు శాశ్వతంగా డిబార్ చేస్తామని హెచ్చరించింది.

నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్.. ఆ నలుగురు నిందితులకు పరీక్ష రాసే ఛాన్స్
X

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆధ్వర్యంలో నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పరీక్ష జరుగనున్నది. నిరుడు అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ జరిగింది. అయితే ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా ఆ పరీక్షను రద్దు చేసి.. తాజగా మరోసారి ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన గందరగొళ పరిస్థితుల కారణంగా.. ఈ సారి టీఎస్‌పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎవరైనా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు శాశ్వతంగా డిబార్ చేస్తామని హెచ్చరించింది.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 503 గ్రూప్-1 పోస్టులకు గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వెలువడింది. అప్పుడు 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్షలో 2.86 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 25,050 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. జూన్‌లో మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా ప్రిలిమ్స్ పరీక్షను, పరీక్ష ఫలితాలను రద్దు చేశారు.

కాగా, గతంలోనే దరఖాస్తు చేసిన వారందరికీ ఎటు వంటి ఫీజులు చెల్లించకుండానే గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసే అవకాశం కల్పించారు. కాగా, ప్రిలిమ్స్ పరీక్ష నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి వేర్వేరుగా టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఇవీ సూచనలు

- ఉదయం 8.30 గంటలకే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 10.15 తర్వాత లోపలకు అనుమతించరు.

- క్యాండిడేట్స్ హాల్ టికెట్‌తో పాటు ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టు లేదంటే ఏదైనా అధికారిక ధృవీకరణ పత్రాన్నిచూపించాలి

- హాల్ టికెట్‌పై ఫొటో లేకపోతే.. తప్పనిసరిగా ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి. వెంట మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకొని వెళ్లాలి.

- వాచీలు, హ్యాండ్‌బ్యాంగ్‌లు, పర్స్‌లు, మొబైల్ ఫోన్లను అనుమతించరు.

- అభ్యర్థులు బూట్లు ధరించకూడదు. కేవలం చెప్పులు మాత్రమే వేసుకోవాలి

- ఓఎంఆర్ షీటుపై కేవలం బ్లాక్ లేదా బ్లూ పాయింట్ పెన్నును మాత్రమే ఉపయోగించారు. పెన్సిల్, జెల్, ఇంకు పెన్ను వాడితే ఓఎంఆర్ స్కానర్ గుర్తించదు.

- ఓఎంఆర్ షీటుపై వ్యక్తిగత వివరాలు బబ్లింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వైట్నర్, చాక్ పౌడర్, బ్లేడ్, ఎరేజర్‌తో బబ్లింగ్‌లో మార్పులు చేసిన ఓఎంఆర్ సీట్లను వాల్యుయేషన్ చేయరు.

ఆ నలుగురికి ఛాన్స్..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసేందుకు ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నలుగురు నిందితులను పరీక్షకు అనుమతించాలని శుక్రవారం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం న్యాయమూర్తి ఇంట్లో జస్టిస్అభినందర్ కుమార్, జస్టిస్ ఎన్. రాజేశ్వరరావుల ధర్మాసనం విచారించింది. పరీక్షకు అనుమతించి, ఫలితాలు హోల్డ్‌లో పెట్టాలన్న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. షమీమ్, సురేష్, సాయి సుస్మిత, రమేశ్‌లకు పరీక్ష రాసేందుకు వీలుగా హాల్ టికెట్లు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది.

First Published:  11 Jun 2023 1:30 AM GMT
Next Story