Telugu Global
Telangana

జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్న టీఎస్‌పీఎస్సీ

లీక్ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ పకడ్బంధీగా చర్యలు చేపట్టింది. పరీక్షా ప్రక్రియ సమగ్రతను నిర్ధారించడానికి అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా బీఎం సంతోశ్‌ను నియమించింది.

జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్న టీఎస్‌పీఎస్సీ
X

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సారి ప్రిలిమ్స్ పరీక్షను ఓఎంఆర్ ఆధారిత ఆలన్‌లైన్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్ 26న నోటిఫికేషన్ వెలువడింది. గత ఏడాది అక్టోబర్‌ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా.. మిగిలిన పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

గత ఏడాది అక్టోబర్‌లో పరీక్ష నిర్వహించిన సమయంలో 3,80,081 మంది దరఖాస్తులు సమర్పించారు. ఇందులో 2,85,916 మంది హాజరవగా.. మెయిన్స్‌కు 25,050 మంది అర్హత సాధించారు. కాగా, లీక్ వ్యవహారంతో ఈ పరీక్షను మరోసారి నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించింది. అదనపు ఫీజు ఏమీ చెల్లించకుండానే అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమిషన్ తెలియజేస్తోంది.

గతంలో జరిగిన లీక్ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ పకడ్బంధీగా చర్యలు చేపట్టింది. పరీక్షా ప్రక్రియ సమగ్రతను నిర్ధారించడానికి అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా బీఎం సంతోశ్‌ను నియమించింది. అంతే కాకుండా పరీక్షల కోసం అదనపు కార్యదర్శి కంట్రోలర్‌గా ఎన్.జగదీశ్వరన్‌ను నియమించింది. కొత్త ప్రశ్నపత్రాలు చాలా జాగ్రత్తగా తయారు చేయబడ్డాయి. ఎలాంటి లీకులకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

కమిషన్ కార్యాలయంలో సామర్థ్యాన్ని, పారదర్శకతను పెంపొందించడానికి చర్యలు తీసుకున్నారు. జూన్ 11న నిర్వహించే ప్రిలిమ్స్ కోసం అత్యంత ముందస్తు జాగ్రత్తలతో ప్రత్యేక వ్యూహం సిద్ధం చేశారు.

First Published:  16 May 2023 11:37 AM GMT
Next Story