Telugu Global
Telangana

హరిత తెలంగాణ ...దేశంలోనే నెంబర్ 1

2019 నుండి 2021 వరకు కేవలం రెండేళ్లలో తెలంగాణ తన అటవీ విస్తీర్ణాన్ని 632 చదరపు కిలోమీటర్ల మేర పెంచగా, ఇతర పెద్ద రాష్ట్రాలు ఈ అంశంలో సాధించిన వృద్ధి అతి తక్కువగా ఉంది. గుజరాత్ 69 చదరపు కిలోమీటర్లు, కర్నాటక 155, మధ్యప్రదేశ్ 11, ఉత్తరప్రదేశ్ 12 చదరపు కిలోమీటర్లు మాతమే ఉన్నది.

హరిత తెలంగాణ ...దేశంలోనే నెంబర్ 1
X

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అడవుల పెంప‌కం, చెట్ల పెంపకం వివరాలను ప్రచురించింది. దాని ప్రకారం అతిపెద్ద రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందంజలో ఉంది.

2019 నుండి 2021 వరకు కేవలం రెండేళ్లలో తెలంగాణ తన అటవీ విస్తీర్ణాన్ని 632 చదరపు కిలోమీటర్ల మేర పెంచగా, ఇతర పెద్ద రాష్ట్రాలు ఈ అంశంలో సాధించిన వృద్ధి అతి తక్కువగా ఉంది. గుజరాత్ 69 చదరపు కిలోమీటర్లు, కర్నాటక 155, మధ్యప్రదేశ్ 11, ఉత్తరప్రదేశ్ 12 చదరపు కిలోమీటర్లు మాతమే ఉన్నది.

చెట్ల విస్తీర్ణం పరంగా కూడా తెలంగాణలో రెండేళ్లలో 334 చదరపు కిలోమీటర్ల మేర చెట్ల విస్తీర్ణం పెరగింది. దీనికి విరుద్ధంగా, గుజరాత్‌లో చెట్ల విస్తీర్ణం 1,423 చదరపు కిలోమీటర్ల మేర తగ్గగా, మధ్యప్రదేశ్‌లో 285 చదరపు కిలోమీటర్ల తగ్గింది. అంటే ఆ మేర ఆయా రాష్ట్రాల్లో చెట్లు నరికి వేస్తున్నారు. దీన్నిబట్టి పచ్చదనం పట్ల బీజేపీ పాలిత రాష్ట్రాల నిబద్ధత తెలుస్తోంది.

శనివారం విడుదల చేసిన ఆర్‌బీఐ హ్యాండ్‌బుక్‌లో తెలంగాణ సాధించిన విజయాలన్నింటినీ హైలైట్ చేశారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 2015లో 19,854 చ.కి.మీల నుంచి 2021కి 21,214 చ.కి.మీలకు పెరిగింది. ఇదంతా రాత్రికి రాత్రే సాధించలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక చొరవతో, పటిష్ట‌మైన‌ ప్రణాళికతో చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల తెలంగాణ పచ్చగా మారింది.

అదేవిధంగా, చెట్ల విస్తీర్ణం 2015లో 2,549 చదరపు కిలోమీటర్ల నుండి 2021లో 2,848 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. రాష్ట్రం ఏర్పడి అతి తక్కువ కాలం అయినప్పటికీ అడవులు, చెట్లను పెంచడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది, దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం 2015-16లో 19,854 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంలో హరితహారం ప్రారంభించింది. అప్పటి నుండి, కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, క్రమం తప్పకుండా నీరు అందించడం, సమర్దవంతమైన‌ మొక్కల నిర్వహణ వల్ల అటవీ విస్తీర్ణంలో స్థిరమైన పెరుగుదలకు సహాయపడింది.

2017 నాటికి 20,419 చ.కి.మీలకు పెరిగిన అటవీ విస్తీర్ణం 2019లో 20,582 చ.కి.మీ.లకు పెరిగి, 2021లో 21,214 చ.కి.మీ.కు చేరుకుంది. అదేవిధంగా, చెట్ల విస్తీర్ణం 2015 లో 2,549 చ.కి.మీ.లు, 2017 లో 2,669 చ.కి.మీ.లకు పెరిగింది. 2021 నాటికి అది 2,848 చ.కి.మీ.కి చేరుకుంది.

అడవి, చెట్లు పెంచడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ, హరిత హారం కార్యక్రమాన్ని సరైన పద్దతిలో అమలు పర్చడం కారణమని అధికారులు చెప్తున్నారు.

First Published:  21 Nov 2022 3:18 AM GMT
Next Story