Telugu Global
Telangana

శ్రీచైతన్య కాలేజీపై ఎంక్వయిరీ రిపోర్ట్.. బయటపడిన దారుణాలు..

ఆత్మహత్య విషయంలో ఎంక్వయిరీ మొదలు పెట్టిన కమిటీకి శ్రీచైతన్య కాలేజీలో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘన కూడా తెలిసొచ్చింది. సాత్విక్ అడ్మిషన్ కూడా వేరే కాలేజీ పేరుతో ఉంది.

శ్రీచైతన్య కాలేజీపై ఎంక్వయిరీ రిపోర్ట్.. బయటపడిన దారుణాలు..
X

హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో ఇటీవల ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాలేజీ సిబ్బంది తనను వేధిస్తున్నారంటూ సాత్విక్ సూసైడ్ లెటర్ రాయడంతో పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ చేపట్టింది. ఈ విచారణ కమిటీ ప్రాథమిక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. కాలేజీ యాజమాన్యం తప్పులన్నీ ఈ నివేదికలో బయటపడ్డాయి.

వేధింపులు నిజమే..

కాలేజీలో సాత్విక్ వేధింపులకు గురయిన విషయం వాస్తవమేనని తేలింది. ఇప్పటికే వేధింపులకు పాల్పడ్డ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి సమాచారం రాబడుతున్నారు. ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా కాలేజీలో ఎంక్వయిరీ చేసింది. వేధింపులు నిజమేనని సాత్విక్ స్నేహితులు కమిటీకి వెల్లడించారు.

నిబంధనలకు పాతర..

ఆత్మహత్య విషయంలో ఎంక్వయిరీ మొదలు పెట్టిన కమిటీకి శ్రీచైతన్య కాలేజీలో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘన కూడా తెలిసొచ్చింది. సాత్విక్ అడ్మిషన్ కూడా వేరే కాలేజీ పేరుతో ఉంది. వేరే కాలేజీలో ఆడ్మిషన్ ఉన్నా కూడా నార్సింగి కాలేజీలో సాత్విక్ చదువుతున్న విషయాన్ని తమ నివేదికలో కమిటీ ప్రస్తావించింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇలాంటి పరిస్థితి ఉందని కమిటీ అభిప్రాయపడింది. శ్రీ చైతన్య కాలేజీలో క్లాసులు నిర్వహిస్తున్నా.. చివరకు విద్యార్ధులకు చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని కమిటీ గుర్తించింది. విద్యార్ధుల అడ్మిషన్లపై రాష్ట్రవ్యాప్తంగా మరోసారి తనిఖీ చేయాలంటూ కమిటీ ప్రభుత్వానికి సూచించింది.

మొత్తమ్మీద సాత్విక్ ఆత్మహత్య వ్యవహారంతో కాలేజీలో జరుగుతున్న అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. కార్పొరేట్ కాలేజీలు సమీపంలోని వేరే కాలేజీల పేరుతో అడ్మిషన్లు తీసుకుని, భారీగా ఫీజులు వసూలు చేయడం గమనార్హం. చివరకు విద్యార్థులను మార్కులు సాధించే యంత్రాల్లాగా మార్చేస్తున్నారు. మార్కుల పేరుతో వేధంపులకు గురి చేయడం వల్లే సాత్విక్ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కొడుకు మరణానికి కారణైనవారికి కఠిన శిక్ష పడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

First Published:  5 March 2023 6:15 AM GMT
Next Story