Telugu Global
Telangana

BF.7 ఆందోళనల నేపథ్యంలో అందుబాటులోకి నాజిల్ వ్యాక్సిన్.. అభినందనలు చెప్పిన మంత్రి కేటీఆర్

BF.7 వ్యాపిస్తున్నదన్న భయాందోళన నేపథ్యంలో భారత్ బయోటెక్ నాజిల్ వ్యాక్సిన్‌ను శుక్రవారం విడుదల చేసింది.

BF.7 ఆందోళనల నేపథ్యంలో అందుబాటులోకి నాజిల్ వ్యాక్సిన్.. అభినందనలు చెప్పిన మంత్రి కేటీఆర్
X

కరోనా కొత్త వేరియంట్ BF.7 విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో అన్ని దేశాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. BF.7 ఉధృతిని చూసిన చైనా ప్రభుత్వం ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. కరోనా మొదటి దశలో అమలు చేసిన కఠిన నిబంధనలనే మరోసారి కొన్ని నగరాల్లో ఇంప్లిమెంట్ చేసింది. దీంతో ఇతర దేశాలు కూడా BF.7 పై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ మార్గదర్శకాలు జారీ చేసింది. బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది.

కరోనా వైరస్ మనుగడలోకి వచ్చిన తర్వాత అనేక పరిశోధనలు చేసి వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. వీటిని పూణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సహా, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ప్రజలకు అందించడం మొదలు పెట్టాయి. నగరంలోని భారత్ బయోటెక్ సొంత పరిజ్ఞానంతో 'కోవాక్సిన్'ను రూపొందించింది. దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించడంతో ప్రజలకు రెండు డోసులు ఇచ్చారు. కోవీషీల్డ్‌తో పాటు కోవాక్సిన్ కూడా కరోనా నుంచి కాపాడటంలో సమర్థవంతంగా పని చేసింది.

ఇక ఇప్పుడు BF.7 వ్యాపిస్తున్నదన్న భయాందోళన నేపథ్యంలో భారత్ బయోటెక్ నాజిల్ వ్యాక్సిన్‌ను శుక్రవారం విడుదల చేసింది. భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ నాజిల్ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం కూడా లభించింది. అత్యవసర పరిస్థితుల్లో దీన్ని బూస్టర్ డోస్‌గా ఇవ్వడానికి అన్ని రకాల అనుమతులు లభించాయి. అయితే BF.7 వ్యాప్తి జరగక ముందే ఈ నాజిల్ వ్యాక్సిన్ రూపొందించినా.. కొత్త వేరియంట్‌పై కూడా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

భారత్ బయోటెక్ iNCOVACC(ఇన్ కోవాక్) అనే పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ నాజిల్ వ్యాక్సిన్ కేవలం 18 ఏళ్లు పైబడిన వాళ్లకు మాత్రమే ఇస్తారు. కరోనా కారణంగా చాలా మందికి ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి. కరోనా వైరస్ ముందుగా ముక్కుల ద్వారా శరీరంలోకి ప్రవేశించడం వల్లే ఊపిరితిత్తులు ఎక్కువగా పాడవుతున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. అందుకే ఈ నాజిల్ వ్యాక్సిన్‌ రూపొందించడానికి అంకురార్పణ పడింది.

నాజిల్ వ్యాక్సిన్ నేరుగా ముక్కుల్లో వేస్తారు. కాబట్టి కరోనా వైరస్ ఎక్కువ కాలం ముక్కులో ఉన్నా పెద్దగా ప్రభావం చూపించదని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ ఊపిరితిత్తుల్లోకి కూడా చేరడం వల్ల లంగ్స్‌కు రక్షణ లభిస్తుంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ప్రయోగ దశలో సమర్థవంతంగా పని చేస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను ల్యాబ్స్‌లో మూడు దశల్లో పరీక్షించారు. మొదటి దశలో 175 మందికి, రెండో దశలో 200 మందికి.. మొత్తంగా 3వేల మందికి పైగా ఈ వ్యాక్సిన్ ఇచ్చి ఫలితాలు రాబట్టారు.

వ్యాక్సిన్ అన్ని దశల్లోనూ సమర్థవంతంగా పని చేసినట్లు, పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేనట్లు తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది. అందుకే ఈ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించినట్లు చెబుతున్నారు. శుక్రవారం నుంచి దీన్ని బూస్టర్‌ డోస్‌గా అందిస్తున్నారు. ఇది తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి.. కొత్త వేరియంట్ల వల్ల కలిగే ప్రభావాలను కూడా అడ్డుకుంటుందని చెబుతున్నారు. అంతే కాకుండా, కరోనా వచ్చినా.. త్వరగా కోలుకునే అవకాశం కూడా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ నాజిల్ వ్యాక్సిన్‌ను కేవలం బూస్టర్ డోస్‌గానే ప్రస్తుతం వాడనున్నారు.

భారత్ బయోటెక్ ఈ ఘనత సాధించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కరోనాపై పోరాటంలో హైదరాబాద్ ముందడుగులో ఉన్నదని మరోసారి రుజువైనట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు సుచిత్ర, డాక్టర్ కృష్ణలకు తన అభినందనలు తెలియజేశారు.



First Published:  23 Dec 2022 1:54 PM GMT
Next Story