Telugu Global
Telangana

రాజకీయాల్లోకి మళ్లీ రాజ్ భవన్.. ఉస్మానియాకు తమిళిసై

ఈరోజు గవర్నర్ తమిళిసై ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. తానెవరినీ తప్పుబట్టేందుకు ఇక్కడికి రాలేదంటున్న ఆమె మరోసారి తెలంగాణలో రాజకీయ కలకలం రేపారు.

రాజకీయాల్లోకి మళ్లీ రాజ్ భవన్.. ఉస్మానియాకు తమిళిసై
X

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజ్ భవన్ లు రాజకీయాలకు వేదికగా మారుతున్నాయి. రాజకీయ విమర్శలకు కూడా గవర్నర్లు ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఉస్మానియా ఆస్పత్రి వ్యవహారంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పరోక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. ఆ తర్వాత మంత్రి హరీష్ రావు ఘాటుగా బదులివ్వడంతో ఆ వ్యవహారం మరింత హైలెట్ అయింది. దీనికి కొనసాగింపుగా ఈరోజు గవర్నర్ తమిళిసై ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. తానెవరినీ తప్పుబట్టేందుకు ఇక్కడికి రాలేదంటున్న ఆమె మరోసారి తెలంగాణలో రాజకీయ కలకలం రేపారు.

రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వహించడం, నేరుగా యూనివర్శిటీలకు వెళ్లి రాజకీయ వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వం పంపించిన బిల్లులను పెండింగ్ లో పెట్టడం ద్వారా తెలంగాణ గవర్నర్ వివాదాలకు కేంద్రబిందువయ్యారు. ప్రభుత్వానికి, గవర్నర్ కి మధ్య గ్యాప్ పెరుగుతోందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే గొడవల్ని తగ్గించుకోడానికి కాకుండా, ఎప్పటికప్పుడు పెంచడానికే అన్నట్టుగా గవర్నర్ వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఉస్మానియా ఆస్పత్రి విషయంలో తమిళిసై చేసిన ట్వీట్ పై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు కేసుల వల్ల ఉస్మానియా ఆస్పత్రి నూతన బిల్డింగ్ పనులు మొదలు కాలేదని మంత్రి హరీష్ రావు వివరణ ఇచ్చారు. కానీ కావాలనే ప్రభుత్వం ఆలస్యం చేస్తోందన్నట్టుగా గవర్నర్ ట్వీట్లు చేయడం సరికాదని అన్నారాయన.

ఆల్రడీ ఈ విషయం వివాదాస్పదంగా ఉన్నప్పుడే గవర్నర్ తమిళిసై ఈ రోజు ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించడం మరింత సంచలనంగా మారింది. ఆస్పత్రిలోని టాయిలెట్లు దారుణంగా ఉన్నాయని, ఆస్పత్రి పైకప్పు పెచ్చులు ఊడి రోగులు బాధపడుతున్నారని, జనరల్‌ వార్డులో కొన్ని ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తున్నాయని, ఎండ వేడికి రోగులు అల్లాడిపోతున్నరని ఆమె తాజాగా విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందించాల్సి ఉంది.

First Published:  3 July 2023 12:32 PM GMT
Next Story